PPP: వైసీపీకి ఒకవైపు పీపీపీ సెగ.. మరోవైపు జగన్ మాటల బూమరాంగ్

PPP: ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని భావించిన వైసీపీ, ఈ ఇష్యూని పీక్ స్థాయికి తీసుకెళ్లింది.

PPP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ‘మెడికల్ కాలేజీల పీపీపీ (PPP) విధానం’ చుట్టూ పెద్ద యుద్ధమే నడుస్తోంది. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై, కోలుకోలేని దెబ్బ తిన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడాదిన్నర కాలం తర్వాత ఒక బలమైన ‘పొలిటికల్ అజెండా’ దొరికింది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం.

ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారనే నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్తుందని భావించిన వైసీపీ, ఈ ఇష్యూని పీక్ స్థాయికి తీసుకెళ్లింది. కానీ, సరిగ్గా పార్టీకి మైలేజ్ వస్తున్న సమయంలో అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పార్టీని డిఫెన్స్‌లోకి నెట్టేసింది. అసలు వైసీపీకి ఈ అంశం ఎంత ప్లస్ అయింది? జగన్ మాటలు ఎందుకు మైనస్ అయ్యాయో అనే చర్చ జోరుగా నడుస్తోంది.

ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత వైసీపీకి ఒక స్పష్టమైన అజెండా లేక చాలా ఇబ్బంది పడింది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP)విధానంలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం వైసీపీకి వరప్రదాయినిగా మారింది. “పేదలకు అందే ఉచిత వైద్యం ప్రైవేట్ పాలవుతోంది” అనే లైన్ సామాన్య ప్రజలకు త్వరగా కనెక్ట్ అయింది.

దీనిపై కోటి సంతకాల సేకరణ, గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వడం వంటి కార్యక్రమాలతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది. వైసీపీ శ్రేణులు ఈ ఇష్యూని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాయని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రశ్నించే క్రమంలో వైసీపీకి మంచి పొలిటికల్ మైలేజ్ లభించింది.

PPP

రాజకీయాల్లో ఏ ఇష్యూ మీద పోరాడుతున్నాం అన్నది ఎంత ముఖ్యమో, ఆ పోరాటంలో వాడే భాష కూడా అంతకంటే ముఖ్యం. ఇక్కడే జగన్ తన పాత స్టైల్‌ను ప్రదర్శించారు. “మేము అధికారంలోకి వచ్చాక ఈ కాలేజీలను పీపీపీ(PPP) పద్ధతిలో తీసుకున్న వారిని రెండు నెలల్లో జైలుకు పంపిస్తాం” అని జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ మాటలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారడమే కాకుండా, సొంత పార్టీ నేతలను కూడా అయోమయంలో పడేశాయి.

ప్రభుత్వం ఇచ్చిన అధికారిక నోటిఫికేషన్ చూసి, టెండర్లు వేసి, బిడ్స్ గెలుచుకున్న ప్రైవేట్ సంస్థలను లేదా కాంట్రాక్టర్లను ఏ చట్టం ప్రకారం జైలుకు పంపిస్తారన్న ప్రశ్న సామాన్యుల నుంచి కూడా వస్తోంది. ఇది నేరుగా ప్రభుత్వ విధానంపై పోరాటం కాకుండా, పెట్టుబడిదారులను భయపెట్టే చర్యగా కనిపిస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా ఒక విధానాన్ని వ్యతిరేకించడం తప్పు కాదు, కానీ ఆ విధానంలో భాగస్వాములైన వారిని నేరస్థులుగా చిత్రించడం ప్రజల్లో నెగెటివ్ సంకేతాలు పంపుతోంది.

జగన్ వ్యాఖ్యలపై జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. “తాటాకు చప్పుళ్లకు భయపడేవారు ఎవరూ లేరు”, “గీత దాటితే తాట తీస్తాం” అంటూ పవన్ చేసిన కామెంట్లు వైసీపీని తీవ్రంగా డిఫెన్స్‌లోకి నెట్టాయి. ఇప్పటికే పార్టీ లోపల జగన్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న సమయంలో, పవన్ అంత స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇవ్వడంతో కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది. ఇది వైసీపీకి వచ్చిన మైలేజీని క్రమంగా తగ్గిస్తూ, మళ్లీ పాత ‘ఫ్యాక్షన్ పాలిటిక్స్’ ఇమేజ్‌ని గుర్తు చేస్తోంది.

వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే కేవలం క్లాస్ ఓటర్లే కాదు, మిడిల్ క్లాస్, ప్రొఫెషనల్స్ ,ప్రైవేట్ రంగ ఓటర్ల నమ్మకం కూడా అవసరం. కానీ “కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తాం”, “ఆ నిర్ణయాలను రద్దు చేస్తాం” అని మాట్లాడటం వల్ల రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు వెనక్కి పోతాయనే భయం ప్రజల్లో కలుగుతుంది. గతంలో పీపీఏల (PPAs) రద్దు అంశం వల్ల వైసీపీకి ‘పెట్టుబడుల వ్యతిరేక పార్టీ’ అనే ముద్ర పడింది. ఇప్పుడు మళ్లీ అదే పంథాలో వెళ్తే, రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందనే నెగెటివ్ ప్రచారం కూటమి పార్టీలకు సులభమవుతుంది. ఒకసారి అటువంటి ఇమేజ్ ఏర్పడితే, దాని నుంచి బయటపడటం పార్టీకి చాలా కష్టం.

గత ఎన్నికల్లో 11 సీట్లకు పడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి వైసీపీ నాయకత్వ భాష, శైలి అని అందరికీ తెలిసిందే. ప్రజలు అప్పుడు మార్పు కోరుకున్నారు. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే భయపెట్టే ధోరణిని కొనసాగించడం వల్ల “వైసీపీ తీరు అస్సలు మారలేదు” అనే అభిప్రాయం బలపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి కానీ, అధికారంలోకి వస్తే ఎలా పాలిస్తామన్న భరోసా కూడా ఇవ్వాలి. ప్రస్తుతం వైసీపీ పోరాటంలో ఆ భరోసా కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోందని విశ్లేషకుల మాట.

మెడికల్ కాలేజీల అంశం నిజంగానే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పెద్ద ఇష్యూ. దీనిపై వైసీపీ మరింత లోతుగా అధ్యయనం చేసి, పీపీపీ (PPP)వల్ల పేదలకు వైద్యం ఎలా దూరం అవుతుందో గణాంకాలతో వివరించాలి. కానీ “జైలుకు పంపిస్తాం, వార్నింగ్స్ ఇస్తాం” వంటి మాటలు అసలు అజెండాను పక్కదారి పట్టించి, వ్యక్తిగత విమర్శల వైపు మళ్లిస్తాయి. దీనివల్ల ఇష్యూ మీద ఉన్న పట్టు పోయి, కేవలం పొలిటికల్ సెటైర్లకు మాత్రమే పరిమితం అవుతుంది.

వైసీపీకి ఇప్పుడు పోరాటంతో పాటు పాలసీ స్పష్టత కూడా అవసరం. ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టే క్రమంలో మాటలు తూటాల్లా ఉండాలి కానీ, అవి పార్టీ సొంత గొయ్యిని తవ్వుకునేలా ఉండకూడదు. జగన్ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీకి మైలేజ్ ఇస్తున్నాయా లేక మరోసారి నెగెటివ్ ఇమేజ్‌ను బలపరుస్తున్నాయా అన్న సందేహం వైసీపీ క్యాడర్‌లో ఉంది. ఒకవిధంగా చెప్పాలంటే జగన్ ప్రతీ మాట కూటమి ప్రభుత్వానికి ప్లస్‌గా మారుతుంది. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ, ప్రజల్లో నమ్మకం కలిగించేలా పార్టీ ముందుకు సాగకపోతే, భవిష్యత్తులో గెలుపు తీరాలకు చేరడం కష్టమే.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version