Punjab Kings : టైటిల్ కల నెరవేరేనా ?.. ఆశల పల్లకిలో పంజాబ్ కింగ్స్

Punjab Kings : ఐపీఎల్ 2026 సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. మినీ వేలం తర్వాత పలు జట్లు కీలక మార్పులు చేసుకున్నా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్ మాత్రం తమ కోర్ టీమ్ పై నమ్మకముంచింది

Punjab Kings

ఐపీఎల్ 2026 సీజన్ కు సమయం దగ్గర పడుతోంది. మినీ వేలం తర్వాత పలు జట్లు కీలక మార్పులు చేసుకున్నా ఒక్కసారి కూడా టైటిల్ గెలవని పంజాబ్ కింగ్స్(Punjab Kings) మాత్రం తమ కోర్ టీమ్ పై నమ్మకముంచింది. ఐపీఎల్ 2025 సీజన్ లో రన్నరప్ గా నిలిచిన జట్టులో ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం పెద్దగా మార్పులు చేయలేదు. మిగిలిన జట్ల కంటే భిన్నంగా 21 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. వేలంలో కూడా పంజాబ్ కింగ్స్ చాలా తెలివిగా వ్యవహరించింది.

ఎక్కువ మందిని రిటైన్ చేసుకోవడంతో తక్కువ మొత్తంతోనే వేలంలోకి వెళ్లింది. కేవలం రూ.11.50 కోట్లతో బరిలోకి దిగి కత్తిలాంటి ఆటగాళ్లను దక్కించుకుంది. గత సీజన్ తో పోలిస్తే కొన్ని బలహీనతలను అధిగమించినట్టే కనిపిస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఇప్పటికే సెటిల్‌గా ఉంది.

అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ వంటి స్టార్ బౌలర్లు, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వంటి దేశవాళీ హిట్టర్లు జట్టుకు కీలకంగా ఉన్నారు. స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్‌లతో కూడిన ఆల్‌రౌండర్లు కూడా బలమని చెప్పొచ్చు.వేలానికి ముందే జట్టుకు భారంగా మారిన మ్యాక్స్‌వెల్ ను వదిలేసిన పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఆ ప్లేస్ ను కూపర్ కనోలీతో భర్తీ చేసింది.

అలాగే బెన్ ద్వార్షుయిస్‌తో బౌలింగ్ బెంచ్‌ను సైతం పటిష్టం చేసుకుంది. ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్ వంటి దేశవాళీ ఆటగాళ్లను బ్యాకప్ ప్లేయర్లుగా తీసుకుంది. బ్యాటింగ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఆ జట్టుకు ప్రధాన బలం.

గత సీజన్ లో వీరిజోడీ పరుగుల వరద పారించింది. 400కు పైగా పరుగులతో 160కి పైగా స్ట్రైక్ రేట్ తో పంజాబ్ కు అద్భుతమైన ఆరంభాలను ఇచ్చిన ఈ ఓపెనింగ్ జోడీపైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది. శ్రేయాస్ అయ్యర్ నిలకడ మరో ప్లస్ పాయింట్. కెప్టెన్సీ ఒత్తిడి ఉన్నా గత సీజన్ లో శ్రేయాస్ అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్ లోనూ శ్రేయాస్ కెప్టెన్సీ, వ్యక్తిగత బ్యాటింగ్ పై భారీ అంచనాలున్నాయి.

Punjab Kings

నేహల్ వధేరా, స్టోయినిస్, కూపర్ కనోలీ వంటి హిట్టర్లపైనా ఆశలు పెట్టుకుంది.బౌలింగ్ లో లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, బౌన్స్ స్పెషలిస్ట్ మార్కో జాన్సెన్‌తో పటిష్టంగానే ఉంది. వీరికి తోడుగా ఇప్పుడు ద్వార్షుయిస్ కూడా కలవడంతో మరింత బలం చేకూరింది. స్పిన్ విభాగంలో ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ బౌలర్లలో ఒకటిగా ఉన్నయజ్వేంద్ర చాహల్ మరోసారి పంజాబ్ కింగ్స్ మ్యాచ్ విన్నర్ గా చెప్పొచ్చు.

అయితే కొన్ని బలహీనతలు కూడా కనిపిస్తున్నాయి. జట్టులో శ్రేయాస్ అయ్యర్, చాహల్, అర్షదీప్ సింగ్ తప్పిస్తే మిగిలిన భారత ప్లేయర్లకు అంతర్జాతీయ అనుభవం లేకపోవడం మైనస్ పాయింట్. అర్షదీప్ కు తోడుగా మరో బలమైన భారత పేసర్ లేకపోవడం కూడా ఇబ్బందే. అటు స్పిన్ విభాగంలో చాహల్ కు బ్యాకప్ గా ఎవ్వరూ లేకపోవడం కూడా మరో ప్రతీకూలాంశంగా భావిస్తున్నారు. ఈ బలహీనతలను అధిగమించి మరోసారి శ్రేయాస్ కెప్టెన్సీ మార్క్ చూపిస్తే మాత్రం పంజాబ్ కింగ్స్ తమ టైటిల్ కలను నెరవేర్చుకునే అవకాశముంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version