Social media
సోషల్ మీడియాలో ఎవరినైనా ఉద్దేశించి ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేయడం, అసభ్యకరమైన కామెంట్స్ పెట్టడం, ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం తరచూ చూస్తూనే ఉంటాం. సొసైటీలో చాలా పద్ధతిగా , మర్యాదగా కనిపించే వ్యక్తులు కూడా సోషల్ మీడియా(Social media)లో మాత్రం చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు.
తన అసలు గుర్తింపు ఎవరికీ తెలియదన్న ముసుగు మనిషికి దొరికినప్పుడు.. మనిషిలోని రాక్షస ప్రవృత్తి ఎలా బయటకు వస్తుందో వివరించే ఈ మానసిక స్థితినే సైకాలజీలో ఆన్‌లైన్ డిస్‌ఇన్హిబిషన్ ఎఫెక్ట్’ (Online Disinhibition Effect) అని పిలుస్తారు.
సాధారణంగా మనం ఎవరితోనైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు, మన మాటలు, బిహేవియర్ వల్ల ఎదుటివారి ముఖంలో కలిగే మార్పులను గమనించగలం. సామాజిక కట్టుబాట్లు, శిక్ష పడుతుందన్న భయం, సొసైటీలో మనకు ఉన్న గౌరవం వారిని వారి హద్దుల్లో ఉంచుతాయి. ఆ లైన్ దాటి ప్రవర్తిస్తే తన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందన్న భయం ఉంటుంది.
కానీ ఆన్‌లైన్ ప్రపంచంలో ఈ అడ్డుగోడలన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి. ఒక నకిలీ ప్రొఫైల్ వెనుక దాక్కున్నప్పుడు, ఆ వ్యక్తి తాను చేసే పనిని ఎవరూ గుర్తించలేరని, తనను ఎవరూ పట్టుకోలేరన్న విపరీతమైన ధైర్యం (Anonymity)పెంచుకుంటాడు. దీనివల్ల నిజ జీవితంలో బయటకు చెప్పలేని తన లోపలి కోపాన్ని, అసూయను సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇతరులపై విషంలా చిమ్ముతారు.
ఈ మానసిక స్థితిలో ఆ మనిషిలో ముఖ్యంగా రెండు రకాల అంశాలు కనిపిస్తాయి. ఒకటి అసింక్రోనిసిటీ (Asynchronicity). అంటే సోషల్ మీడియాలో మనం ఒక కామెంట్ పెట్టినప్పుడు, దానికి ఎదుటివారిచ్చే సమాధానం వెంటనే ఉండకపోవచ్చు. దీనివల్ల ఆ కామెంట్ వల్ల కలిగే పరిణామాలను ఆలోచించే బాధ్యత నుంచి మెదడు తప్పుకుంటుంది.
రెండవది సోలిప్సిస్టిక్ ఇంట్రోజెక్షన్ (Solipsistic Introjection). అంటే ఆన్‌లైన్‌లో వేరొకరితో గొడవపడుతున్నప్పుడు, ఎదుటి మనిషిని ఒక రక్తం మాంసాలు ఉన్న వ్యక్తిగా కాకుండా, కేవలం ఒక స్క్రీన్ మీద కనిపించే అక్షరాల రూపంగానే వారి మెదడు పరిగణిస్తుంది. దీనివల్ల ఎదుటివారి బాధను అర్థం చేసుకునే సహానుభూతి (Empathy) పూర్తిగా నశిస్తుంది.
అంతేకాకుండా, ఆ కొత్త ప్రపంచంలో ఆ మనిషి తనను తాను ఒక కాల్పనిక వీరుడుగా ఊహించుకునే అవకాశం దొరుకుతుంది. తానే ఒక న్యాయమూర్తిలా మారి ఇతరులకు తీర్పులివ్వడం, వారిని కించపరచడం, వ్యక్తిగతంగా లేని విషయాలను కూడా ఉన్నట్లు చిత్రీకరించి వారితో వాదనకు దిగడం చేస్తారు.
దీని ద్వారా వారు ఒక రకమైన తప్పుడు అధికార భావనను (Sense of Power) పొందుతారు. ఎదుటివారు పడుతున్న వేదనను, మానసిక క్షోభను కళ్లతో చూడకపోవడం వల్ల, తాము చేస్తున్నది ఎంత పెద్ద తప్పో వారికి అర్థం కాదు. అందుకే ఇంటర్నెట్‌లో దొరికే ఈ గుర్తింపు లేని స్వేచ్ఛ..కొంతమంది మనుషులను మృగాల్లా మారుస్తుంది.
ఈ ప్రవర్తనను అరికట్టాలంటే సోషల్ మీడియా (Social media) నియమాలు కఠినంగా ఉండాలి. సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా మరింత పెరగాలి. ఆన్‌లైన్‌లో మనం మాట్లాడుతున్నది కూడా ఒక మనిషితోనే అన్న స్పృహ అందరిలో కలగేలా చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లు నేర్పాలి. ఆన్ లైన్ ముసుగు వారిని అప్పుడు కాపాడొచ్చు కానీ, ఏదొక రోజు విషయం బయటపడితే వారి వ్యక్తిత్వానికి మచ్చ అని ప్రతి నెటిజన్ గుర్తుంచుకోవాలి.
Thalapathy Vijay: కింగ్ మేకర్ పాత్రలో దళపతి విజయ్? తమిళనాడులో కొత్త చరిత్ర సృష్టించబోతున్న టీవీకే..
