Spotlight Effect
మనం ఏదైనా ఫంక్షన్‌కో, పార్టీకో వెళ్లినప్పుడు మన డ్రెస్ కొంచెం నలిగినా, ముఖం మీద మచ్చలు, మొటిమలు ఉన్నా, లేదా అందరి ముందు మాట్లాడుతూ ఉండగా.. ఏదైనా పదం తప్పుగా దొర్లినా..అయ్యో అందరూ నావైపే చూస్తున్నారు, అందరికీ నా తప్పు తెలిసిపోయిందని లోలోపల విపరీతంగా మదనపడిపోతుంటారు.
ఇంకా వివరంగా చెప్పాలంటే స్టేజీ మీద వెలుగుతున్న స్పాట్‌లైట్.. కేవలం మన మీదే ఫోకస్ చేసి ఉన్నట్లు, ప్రపంచం మొత్తం మన ప్రతి కదలికను భూతద్దంలో పెట్టి మరీ చూస్తున్నట్లు భ్రమపడతాం. సైకాలజీలో దీనినే స్పాట్‌లైట్ ఎఫెక్ట్ (The Spotlight Effect) అంటారు. అంటే మన గురించి మనం అతిగా ఊహించుకోవడం వల్ల కలిగే ఒక మానసిక స్థితి ఇది అన్నమాట.
నిజానికి, ఎవరి జీవితంలో వారే హీరోలు కాబట్టి, ఎవరి మీద వారికి పూర్తి శ్రద్ధ ఉంటుంది. కానీ వాస్తవానికి వస్తే..ఈ ప్రపంచంలో ఎవరికి వారు తమ సొంత జీవితాల్లో బిజీగానే గడుపుతారు. రోడ్డు మీదకు వెళ్లే వ్యక్తికి తన జేబులో కొనాల్సిన సామానులకో, ఇతర అవసరాలకో డబ్బులు సరిపోతాయా లేదా అన్న టెన్షన్ ఉంటుంది తప్ప, ఎదుటి వ్యక్తి షర్టుకు బటన్ ఊడిందా, ఆమె జడ సరిగా లేదా వంటి విషయాలు అస్సలు పట్టించుకోరు.
ఒక ప్రయోగంలో భాగంగా, కొందరు విద్యార్థులకు అందరూ వింతగా చూసేలా ఉండే టీ-షర్ట్ వేయించి పంపారు. ఆ విద్యార్థులు కనీసం సగం మంది తనను గమనించారని అనుకున్నారు. కానీ తీరా ఆరా తీస్తే, అందులో పది శాతం మంది కూడా వారిని పట్టించుకోలేదని తెలిసింది.
ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్(Spotlight Effect) వల్ల చాలా మందికి రియల్‌గా కంటే సోషల్ యాంగ్జయిటీ పెరిగిపోయింది. నలుగురిలోకి వెళ్లాలంటే భయం, కొత్తగా ఏదైనా ప్రయత్నించాలంటే నవ్వుతారేమోనన్న ఆందోళన వారిని వెనక్కి లాగుతాయి. మనలో మనకు కనిపించే లోపాలు ఎదుటివారికి అసలేమీ కనిపించవు. ఒకవేళ కనిపించినా వారు దానిని కాసేపటి కంటే ఎక్కువ గుర్తుంచుకోరు. మన తప్పులను మనం బాగా గుర్తుంచుకుంటాం కానీ, వేరే వాళ్లు అంతగా పట్టించుకోరన్నదే ఇక్కడ అసలు నిజం.
దీని నుంచి బయటపడాలంటే..లోకానికి నా గురించి ఆలోచించేటంత తీరిక లేదనే నిజాన్ని మనం మనసులో బలంగా అనుకోవాలి. మీరు మీ మీద పెట్టుకున్న స్పాట్‌లైట్ ను ఒక్కసారి ఆఫ్ చేసి చూస్తే.. ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది.
