Fall In Love
మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాల ఎమోషన్స్‌ను ఫేస్ చేస్తాడు. వీటిలో కోపం, బాధ, సంతోషం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రేమలో పడటం(Fall In Love) అనేది మాత్రం పూర్తిగా వేరొక ఎత్తు అంటారు మానసిక నిపుణులు. అసలు ఈ ప్రేమ అనే ఫీలింగ్ మనిషిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటే..అది ఒక వ్యక్తిని పూర్తిగా మార్చేస్తుందని చెబుతారు.
నిజానికి అందుకేనేమో ప్రేమను ఒక అంతుచిక్కని అద్భుతం అంటారు. అసలు ప్రేమ ఎప్పుడు పుడుతుంది? ఎందుకు పుడుతుందని అడిగితే ప్రపంచంలో ఎవరి దగ్గరా కూడా కచ్చితమైన సమాధానం లేదు. అయితే, అసలు ఒక మనిషి తన జీవిత కాలంలో ఎన్నిసార్లు గాఢమైన ప్రేమను అనుభవించగలడనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తుంది. అంతేకాదు ఇది కేవలం కవుల ఊహలకే పరిమితమా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ లెక్క ఉందా అంటే సమాధానం ఉందనే వస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వివిధ ఏజ్ గ్రూపుల వారిపై నిర్వహించిన సామాజిక పరిశోధనల ప్రకారం.. మెజారిటీ మనుషులు తమ లైఫ్ జర్నీలో సగటున రెండుసార్లు అత్యంత గాఢమైన ప్రేమను (Deep Love) అనుభవిస్తారని తేలింది.
మొదటిది యవ్వనంలో వచ్చే ఒక మధురమైన అలజడి అయితే, రెండోది పరిణతి చెందిన మనసుతో పొందే ఒక స్థిరమైన బంధం. అయితే ఈ లెక్క అందరికీ వర్తించదు. కొందరికి ఈ ప్రేమలో పడే అనుభూతి ఒక్కసారి మాత్రమే సాధ్యపడితే, మరికొందరికి నాలుగు సార్లు కానీ అంతకంటే ఎక్కువసార్లు కూడా పలకరిస్తుందట.
చాలామంది ప్రేమలో పడటం (Fall In Love) అంటే కేవలం టీనేజ్, ఇరవైలలో వచ్చే ఆకర్షణ అంటూ పొరబడుతుంటారు. కానీ నిజానికి యుక్తవయసులో ఉన్నవారి కంటే వయసు మళ్లిన వారికే ఎక్కువ ప్రేమ అనుభవాలున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కారణం అనుభవమేనట.
వయసు పెరిగే కొద్దీ మనిషిలో భావోద్వేగాల పట్ల పూర్తి అవగాహన పెరుగుతుంది. అందుకే 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా కొత్తగా ప్రేమలో పడటం, ఆ అనుభూతిని మరింత గాఢంగా ఆస్వాదించడం సాధ్యమవుతుందని మానసిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
నిజానికి ప్రేమలో మూడు కోణాలున్నట్లు మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే నిజమైన ప్రేమ నిలబడాలంటే 3 ముఖ్యమైన స్తంభాలు ఉండాలి.
వ్యామోహం (Passion).. శారీరక , మానసిక ఆకర్షణ
సాన్నిహిత్యం (Intimacy).. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, మనసు విప్పి మాట్లాడుకోవడం.
నిబద్ధత (Commitment).. కష్టసుఖాల్లో తోడుంటామనే నమ్మకం.
ఒక మనిషి జీవితంలో ఈ మూడూ అంటే వ్యామోహం, ఇంటిమసీ, కమిట్మెంట్ సమపాళ్లలో ఉన్న బంధం ఎదురైనప్పుడు.. దానిని గాఢమైన ప్రేమగా గుర్తిస్తారు. ఇలాంటి సందర్భం మనిషి జీవితంలో చాలాసార్లు రావచ్చు. అది వారి వ్యక్తిత్వంతో వారు పెరిగిన సామాజిక వాతావరణంపైన కూడా ఆధారపడి ఉంటుందట.
ప్రేమ లేని జీవితం ఉంటుందా అనే దానిపై ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో దాదాపు 14 శాతం మంది తమ జీవితంలో ఎప్పుడూ గాఢమైన ప్రేమను అనుభవించలేదని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే, ప్రేమ అనేది అందరికీ తప్పనిసరిగా ఎదురయ్యే అనుభవం కాకపోవచ్చన్న మాట. మరికొందరికి మాత్రం ఇది కేవలం ఒకే ఒక్క వ్యక్తితో మొదలై, వారితోనే ముగిసిపోతుంది.
చివరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే..ప్రేమకు పరిమితి ఉండదు. అది ఒక ప్రవాహం వంటిది. కొందరి జీవితంలో ప్రేమ ఒకే ఒకసారి పలకరించి నిలిచిపోతుంది. మరికొందరి జీవితంలో మాత్రం కొత్త దారులను వెతుక్కుంటూ మళ్లీ మళ్లీ వస్తుంటుంది. ఏది ఏమైనా, ఆ ప్రేమ పంచే ఫీలింగ్‌ను మనిషిని మానసికంగా మరింత బలంగా, సంతోషంగా ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
