Afraid
ఒక వ్యక్తి చిన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేసి.. తర్వాత చాలా ఎత్తుకు ఎదగొచ్చు, లగ్జరీ కార్లలో తిరుగుతూ, ఖరీదైన ఇంట్లో నివసించొచ్చు. కానీ, హోటల్‌కు వెళ్లినప్పుడు మెనూ కార్డ్‌లో రేట్లు చూసో, షాపింగ్ మాల్‌లో బట్టల ప్రైస్ ట్యాగ్ చూసి భయపడినా (Afraid) లేదా గుండెల్లో ఏదో తెలియని ఆందోళన మొదలైనా, అది నిజానికి పొదుపు కాదు. దానిని సైకాలజీలో స్కేర్సిటీ మైండ్‌సెట్ ట్రామా అంటారు.
అంటే, మనిషి పేదరికం నుంచి బయటపడి ఐశ్వర్యంలోకి వచ్చినా, అతని మనసు మాత్రం ఇంకా ఆ పాత కష్టాల కాలంలోనే లాక్ అయిపోయిందన్నమాట. చిన్నతనంలో కానీ గతంలో కానీ అనుభవించిన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కొంతమంది మెదడుపై ఒక బలమైన ముద్ర వేస్తాయి. దీనివల్ల ఇప్పుడు డబ్బులు ఖర్చు చేస్తే రేపు మళ్లీ పాత పరిస్థితులలోకి వెళ్లిపోతానేమో అని.. అలాగే రేపు ఏం జరుగుతుందో, ఉన్న డబ్బు కూడా అయిపోతుందేమోననే ఒక అభద్రతా భావం వారిని నీడలా వెంటాడుతూ ఉంటుంది.
ఇలాంటి ట్రామా ఉన్న వ్యక్తులు ఎంత సంపాదించినా కూడా తమను తాము ధనవంతులుగా ఫీల్ అవ్వలేరు. ఏదైనా వస్తువును కొన్నప్పుడు దానిని చూస్తే కలిగే ఆనందం కంటే, ఆ డబ్బు ఖర్చయిపోయిందనే బాధే వారిని ఎక్కువగా బాధిస్తుందట. దీనిని హైపర్-ఫ్రుగాలిటీ అని కూడా అంటారు. అంటే అవసరం ఉన్నా సరే, ఖర్చు పెట్టడానికి ఎక్కువగా భయపడటం(Afraid).
చిరిగిన బట్టలున్నా కొత్తవి కొనడానికి వెనకాడటం కానీ ఇంట్లో వస్తువులు పాడైనా రిపేర్ చేయించకుండా నెట్టుకురావడం కానీ వంటివి దీనిలో భాగమే. ఇది డబ్బు మీద ఉన్న పిసినారితనం కానే కాదు. మళ్లీ ఆ పాత రోజులు ఎక్కడ తిరిగి వస్తాయోనన్న భయం(Afraid)తో కూడిన ఒక మానసిక పరిస్థితి. పాత జ్ఞాపకాలు, భయాలు వారి ప్రస్తుత సంతోషాన్ని అనుభవించనివ్వకుండా అడ్డుపడుతుంటాయి.
దీని నుంచి బయటపడాలంటే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం కాదు,వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. ముందుగా వారి దగ్గర తగినంత ఆర్థిక భద్రత ఉందని మెదడుకు నమ్మకాన్ని కలిగించాలి. ప్రతి చిన్న ఖర్చును ఒక నష్టంగా , ధన వ్యయంగా కాకుండా, అది వారి జీవితానికి ఇస్తున్న విలువగా చూడటం అలవాటు చేసుకోవాలి.
మనసులో ఉన్న ఆ పాత పేదరికమనే ముద్రను చెరిపేసి, ఇప్పుడు సేఫ్ జోన్‌లో ఉన్నామనే నిజాన్ని అంగీకరించాలి. అప్పుడే వారు సంపాదించిన డబ్బుకు, సాధించిన విజయానికి అసలైన అర్థం దొరుకుతుంది. నిజమైన వెల్త్ అనేది అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌లో మాత్రమే కాదని.. ఖర్చు చేసేటప్పుడు మనసులో ఉండే ప్రశాంతతలో కూడా ఉంటుందని తెలుసుకోగలగాలి.
