Pigeons
పూర్వం చక్రవర్తులు, మహారాజులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సమాచారం పంపడానికి పావురాలను(Pigeons) వాడేవారు. ఇప్పటికీ కొన్ని చోట్ల పావురాలను ఉపయోగించుకుంటున్న ఘటనలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే వేల మైళ్ల దూరం ప్రయాణించినా సరే పావురాలు ఎక్కడా దారి తప్పకుండా అవి కచ్చితంగా తమ గమ్యస్థానానికి ఎలా చేరుకుంటాయనే విషయం మాత్రం అందరికీ మిస్టరీనే. అయితే దీని వెనుక అంతా ఆశ్చర్యపోయే శాస్త్రీయ రహస్యం ఉందట.
పావురాల ముక్కు భాగంలో భూమికి గల అయస్కాంత క్షేత్రాన్ని (Magnetic Field) గుర్తించగల ప్రత్యేకమైన కణాలుంటాయట. పావురాలకు ఈ కణాలు ఒక నేచురల్ మ్యాప్ లాగా పనిచేస్తాయి. భూమికి ఉండే ఉత్తర, దక్షిణ ధ్రువాల దిశలను బట్టి పావురాలు తాము ఎటు వెళ్లాలో నిర్ణయించుకుంటాయట. అంతేకాదు శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, ముక్కు భాగమే కాకుండా పావురాల కళ్లలో ఉండే కొన్ని ప్రోటీన్లు వల్ల కూడా.. భూమి అయస్కాంత తరంగాలను చూడగలుగుతాయట.
అంతేకాదు పావురాలకు వాసన పసిగట్టే శక్తి చాలా ఎక్కువ . గాలిలో ఉండే రకరకాల వాసనలను బట్టే అవి తమ గూడు ఉన్న ప్రాంతాన్ని చాలా తేలికగా గుర్తుపడతాయి. అలాగే, మనుషులు వినలేని అతి తక్కువ పౌనఃపున్యం గల శబ్దాలను కూడా పావురాలు వినగలవు. సముద్ర అలల శబ్దం కానీ పర్వతాల గుండా వచ్చే గాలి శబ్దాలను కానీ ..మైళ్ల దూరం నుండే గ్రహించి దారిని గుర్తిస్తాయి.
అలాగే పావురాలు ఏ దారిలో అయితే ప్రయాణిస్తాయో..ఆ ప్రయాణంలో తమ కింద ఉన్న రహదారులు, నదులు, కొండలు వంటి గుర్తులను ల్యాండ్ మార్కులుగా బాగా గుర్తుపెట్టుకుంటాయి. అందుకే వీటిని ఎక్కడ వదిలిపెట్టినా సరే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా, కచ్చితంగా తమ సొంత గూటికి చేరుకుంటాయి. అందుకే వీటిని శాంతి దూతలుగా మాత్రమే కాకుండా, అప్పట్లో గొప్ప కమ్యూనికేషన్ సాధనాలుగా కూడా వాడేవారు.
