Love
మనుషుల మధ్య ఉన్న ఏ బంధం అయినా సున్నితమైన దారం వంటిదే. ఒక్కోసారి అంతులేని అనురాగంతో ఆ దారం గట్టిగా ముడిపడి ఉంటే, మరికొన్ని సార్లు తెలియని మౌనంతో వదులైపోతుంటుంది. ఎలా అంటే అప్పటి వరకూ మనల్ని ప్రాణంగా చూసుకునే మనిషి, కాసేపయ్యాక కారణం తెలియని నిర్లక్ష్యం చూపిస్తారు. ఇలాంటి సమయాలలోనే వారిద్దరి మధ్య ఉన్న ఆ బంధం జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది.
నిజం చెప్పాలంటే ప్రేమ(love) అనేది ఒక నిరంతర ప్రవాహం వంటిది. కానీ, మనిషి తనలోని మానసిక సంఘర్షణల వల్లో ఒత్తిడి వల్లో ఒక్కోసారి ఆ ప్రవాహానికి కావాలనో లేదా తనకు తెలీకుండానో అడ్డుకట్ట వేస్తుంటాడు. సైకాలజీలో దీనినే ఎమోషనల్ ఇన్ కన్సిస్టెన్సీ అని అంటారు.
అసలు ఎమోషనల్ ఇన్ కన్సిస్టెన్సీ ఏంటంటే .. తనలోని భావోద్వేగాలను ఎలా పంచుకోవాలో తెలియకపోవడం కానీ ఎదుటివారికి తన బలహీనతలు తెలిసిపోతాయేమోనన్న భయంతో కానీ కొంతమంది ఇలా మౌనాన్ని ఆశ్రయిస్తుంటారని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే భావోద్వేగాలలో స్థిరత్వం లేకపోవడం అన్నమాట.
ఈ పరిస్థితి కేవలం ప్రేమికుల మధ్యనే కాదు, భార్యాభర్తలు, అత్యంత ఆత్మీయమైన స్నేహితుల మధ్య కూడా ఒక్కోసారి ఏర్పడవచ్చు. ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తిని మభ్యపెట్టడానికి ‘బిజీ’ అనే పదాన్నో, లేక సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోవడాన్నో ఒక ఆయుధంగా మార్చుకుంటారు.
అటాచ్‌మెంట్ స్టైల్స్ గురించి ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే..దీనిలో మనకు ముఖ్యంగా మూడు రకాల మనుషులు కనిపిస్తారు. దీనిలో మొదటి రకం వారు సెక్యూర్ అటాచ్‌మెంట్ కలిగిన వారు. అంటే వీరు ప్రేమను స్థిరంగా చూపిస్తారు, ఏవైనా గొడవలు వచ్చినా నిజాయితీగా మాట్లాడి పరిష్కరించుకుంటారు.
రెండో రకం వారు యాన్షియస్ అటాచ్‌మెంట్ కలవారు. అంటే వీరు తమ భాగస్వామి ఎక్కడ విడిచి వెళ్లిపోతారో అని ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. అందుకే అతిగా ప్రేమ(love)ను చూపిస్తూ పదే పదే అవతలివారి వద్ద భరోసా కోరుకుంటారు.
ఇక మూడో రకం వారు అవాయిడెంట్ అటాచ్‌మెంట్ కలవారు. అంటే వీరే మనం మొదట్లో చెప్పుకున్న మనుషులు. వీరేం చేస్తారంటే బంధం కొంచెం లోతుగా మారుతోంది అనిపించగానే, భయంతోనో, అసౌకర్యంతోనో కావాలని దూరంగా జరిగిపోతారు. ఉదాహరణకు, ముందురోజు మీతో గంటల తరబడి కబుర్లు చెప్పిన వ్యక్తి, మరుసటి రోజు మీరు మెసేజ్ చేస్తే సమాధానం ఇవ్వడం మానేస్తారు. ఇలాంటివారు తమ భావోద్వేగాలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు.అయితే ఇది కావాలని చేసింది మాత్రం కాదంటారు సైకాలజిస్టులు.. ఇది కేవలం వారి బలహీనత మాత్రమేనని వివరిస్తున్నారు .
ఇలాంటివారు దీనిని మొదటలోనే గుర్తించి తమను తాము మార్చుకుంటే పరిస్థితి విషమించదు. నిజాయితీ లేని చోట ఎన్ని మాటలు చెప్పినా కూడా అవి నీటి మూటలే అవుతాయని తెలుసుకోవాలి . సింపుల్‌గా చెప్పాలంటే మనిషి తనను తాను ప్రేమించుకోవడం కంటే, ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకున్నప్పుడే ఏ బంధం అయినా చిరకాలం పచ్చగా ఉంటుంది.
