Sorry
మనుషులెవరైనా సరే తప్పులు చేయడం సహజమే. తప్పు జరిగినప్పుడు ఎదుటివ్యక్తికి మనస్ఫూర్తిగా సారీ(Sorry) చెప్పడం వల్ల ఎలాంటి సమస్య అయినా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇది ఒక మంచి సంస్కారానికి గుర్తు. కానీ, కొంతమంది మాత్రం.. ప్రతి చిన్న విషయానికి సారీ చెబుతూ ఉంటారు. ఇంకొంతమంది ఒకే తప్పును పదే పదే చేస్తూ ప్రతిసారీ సారీ.. ఇకపై ఇలా జరగదని చెప్పేస్తూ ఉంటారు.
సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం మొదటిసారి మిస్టేక్ చేసినప్పుడు అది కేవలం పొరపాటు లేదా తప్పు అవుతుంది. కానీ, అదే తప్పు అని తెలిసి కూడా పదే పదే రిపీట్ చేస్తే.. అది తప్పు కాదు,అదొక అలవాటుగా మారిపోతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఈ ప్రవర్తన వెనుక ఒక బలమైన సైకలాజికల్ రీజన్ ఉంది. చాలా మంది సారీ అనే పదాన్ని చాలా ఈజీగా వాడేస్తుంటారు. తాము తప్పు చేసినప్పుడు ఎదుటివారు ఎక్కడ నిలదీస్తారో, ఎక్కడ గొడవ అవుతుందోననే భయంతో వెంటనే సారీ(Sorry) చెప్పేస్తారు.
ఇలా సారీ చెప్పేయడం వల్ల ఎదుటి వ్యక్తి కోపం చల్లారుతుందని, ఆ సమస్య అక్కడితో ముగుస్తుందని వారికి బాగా తెలుసు. అంటే, వీరు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పరు. కేవలం ఆ సమయానికి వచ్చే సమస్య నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ఈ పదాన్ని వాడతారు. ఇలాంటి వారిని సైకాలజీలో కంపల్సివ్ అపాలజైజర్స్ అని పిలుస్తారు.
ఒక తప్పును పదే పదే చేస్తూ సారీ చెప్పే వారిలో కమిట్‌మెంట్ లేకపోవడమే మెయిన్ రీజన్ . వీరు మాట వరుసకు క్షమాపణలు చెప్తారు తప్ప, ఆ తప్పును సరిదిద్దుకోవడానికో, భవిష్యత్తులో అది రిపీట్ కాకుండా చూసుకోవడానికో ఎలాంటి ప్రయత్నం కూడా చేయరు.
ఉదాహరణకు ప్రతిరోజూ ఆఫీసుకు ఆలస్యంగా రావడం లేదా పార్ట్‌నర్‌కు ఇష్టం లేని పని చేయడం ప్రతిసారీ సారీ చెప్పడం చేస్తుంటారు. ఇక్కడ సారీ అనేది వారి ప్రవర్తనను మార్చుకోవడానికి వాడటం లేదు. కేవలం తమ తప్పును సమర్థించుకోవడానికి ఒక లైసెన్స్ లాగా వాడుకుంటున్నారు. దీనివల్ల మెల్లగా ఆ తప్పు వారి జీవితంలో ఒక బలమైన అలవాటుగా (Habit) స్థిరపడిపోతుంది. దీంతో ఇలాంటి వ్యక్తుల వల్ల బంధాలలో అవతలివారికి వీరిపై పూర్తిగా నమ్మకం పోతుంది.
ఇక మరికొందరిలో ఇలా సారీ చెప్పే అలవాటు.. వారిలో ఉండే తీవ్రమైన ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్, అలాగే భయం వల్ల వస్తుందని సైకాలజీ చెబుతుంది. చిన్నతనం నుంచి కఠినమైన వాతావరణంలో పెరిగిన వారు లేదా ఎప్పుడూ విమర్శలను ఎదుర్కొనే వారు తామేం చేసినా తప్పే అవుతుందేమోనని భయపడుతుంటారు.
తమ వల్ల ఎదుటివారు ఎక్కడ బాధ పడతారో, ఎక్కడ అసంతృప్తికి గురవుతారో అనే ఆలోచనతో.. తాము తప్పు చేయకపోయినా సరే ముందే సారీ చెప్పేస్తుంటారు. ఇలా ఎప్పుడూ క్షమాపణలు చెప్పడం వల్ల వారి విలువను వారే తగ్గించుకున్నవారవుతారు. ఎందుకంటే ఈ అలవాటు వల్ల ఎదుటివారు వారిని చాలా తేలికగా తీసుకునే అవకాశం ఉంది.
ఈ అలవాటు నుంచి వారు బయటపడాలంటే ఒక విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. నిజమైన క్షమాపణ అనేది కేవలం పెదవుల నుంచి వచ్చే మాటల్లో ఉండదు. వారి ప్రవర్తనలో వచ్చే మార్పులోనే ఉంటుంది.
ఒక తప్పు జరిగినప్పుడు సారీ చెప్పడం మంచిదే ..అలాగే దాంతో పాటు ఈ తప్పు మళ్లీ జరగకుండా తానేం చేయాలని ఆలోచించినప్పుడే ఆ సమస్యకు పర్మినెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. మాటి మాటికి ఊరికే సారీలు చెప్పడం ఆపి.. బాధ్యతను సక్రమంగా నిర్వహించినప్పుడే మన బంధాలలో గౌరవం, నమ్మకం నిలబడతాయి.
Pune Murder Case : పూణే మర్డర్ కేసులో ఎవరిది తప్పు? ఆ ముగ్గురు తండ్రుల గుండెకోతకు కారణం ఏంటి?
