Elephant Parenting
ఈ రోజుల్లో పిల్లలను పెంచడం, వారికి మంచి అలవాట్లు వచ్చేలా చేయడం పేరెంట్స్‌కు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారింది. కొంతమంది చాలా ఎక్కువగా భయపడుతూ పిల్లలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయంలోనూ జోక్యం చేసుకుంటూ హెలికాప్టర్ పేరెంటింగ్‌ను ఫాలో అవుతుంటే మరికొంతమంది మాత్రం తమ పిల్లలను అసలు పట్టించుకోవడం లేదు.
రెండు రకాల పేరెంట్స్ కోసం ప్రస్తుతం కొత్త పెంపకం విధానమైన ఎలిఫెంట్ పేరెంటింగ్(Elephant Parenting) ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతుంది. అసలు ఏనుగుల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ఈ పేరెంటింగ్ అంటే ఏంటి? దీని వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా మారుతుందనేది చాలామందికి తెలీదు.
అంటే ఏనుగుల గుంపులో పిల్ల ఎలిఫెంట్‌ను పెద్ద ఏనుగులన్నీ ఎంతో ఆప్యాయంగా కంటికి రెప్పలా చూసుకుంటాయి. కానీ అదే సమయంలో ఆ చిన్న ఏనుగు తన చుట్టూ ఉన్న అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఫ్రీడమ్‌ను కూడా ఇస్తాయి. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌ను మన పిల్లల పెంపకంలో వాడటాన్ని ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటారని సైకాలజిస్టులు అంటున్నారు. అంటే పిల్లలకు కొండంత ప్రేమను, భద్రత ఇస్తూనే వారు స్వతంత్రంగా ఎదగడానికి కావాల్సిన స్వేచ్ఛను ఇవ్వడం అన్నమాట.
ఈ విధానంలో తల్లిదండ్రులు పిల్లలకు మీరు ఏ పరిస్థితిలో.. ఉన్నా మేము మీకు అండగా ఉంటామనే నమ్మకాన్ని ఇస్తారు. ఉదాహరణకు స్కూలులో తక్కువ మార్కులొస్తే ఎందుకు తక్కువ వచ్చాయని దెబ్బలాడటం, దండించడం చేయరు. పిల్లలకు ఏ సబ్జెక్ట్ కష్టంగా అనిపిస్తోంది? మనం దానిని ఎలా సరిదిద్దుకుందామని ప్రశాంతంగా మాట్లాడుతారు.
పిల్లలు ఏమైనా తప్పులు చేసినప్పుడు వెంటనే వారిపై కోప్పడటం, శిక్షించడం కాకుండా..ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునేలా పేరెంట్స్ ప్రోత్సహిస్తారు. దీని వల్ల పిల్లలు ఏదైనా సమస్య వచ్చినపుడు వాటిని చూసి భయపడకుండా, స్వయంగా ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకుంటారు.
ఎలిఫెంట్ పేరెంటింగ్ అంటే అతిగా ముద్దు చేసేయడం లేదా అడిగిన ప్రతిదీ ఇచ్చేయడం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎలిఫెంట్ పేరెంటింగ్‌లో పేరెంట్స్ ప్రేమతో పాటు కచ్చితమైన హద్దులు కూడా పెడతారు.
వారి వస్తువులు వారే సర్దుకోవడం, వారే సొంతంగా చిన్న చిన్న నిర్ణయాలను తీసుకోవడం వంటి బాధ్యతలను చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. ప్రపంచంలోని చిన్న చిన్న కష్టాల నుంచి పిల్లలను దాచేయడం కాకుండా.. ఆ కష్టాలను ఎదుర్కొనేంత మెంటల్ మెచ్యూరిటీని, కాన్ఫిడెన్స్‌ను అందించడమే ఈ మెథడ్ యొక్క అసలైన మ్యాజిక్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
