Cockroach Janta Party : భారత్ కు కాక్రోచ్ పార్టీ ఫౌండర్..జూన్ 6న ఏం జరగబోతోంది ?

Cockroach Janta Party : దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలతో పాటు ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణ తీరుపై వివాదాలు రేగుతున్న తరుణంలో, నూతనంగా ఏర్పాటైన ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక ప్రకటన చేశారు

దేశాన్ని కుదిపేస్తోన్న కాక్రోచ్ జనతా పార్టీ ఇక కదనరంగంలోకి దిగుతోంది. ఇప్పటి వరకూ సోషల్ మీడియాతో సంచలనంగా మారిన సీజేపీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party )వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే భారత్ కు రానున్నారు.

ఈ మేరకు సోషల్ మీడియా ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. దీని కోసం జూన్ 6న భారత్ కు వస్తున్నట్టు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. రాజధానిలో శాంతియుత నిరసనలు తెలిపేందుకు విద్యార్థులు, నిరుద్యోగులు, తన పార్టీ మద్దతు దారులు తరలిరావాలని కోరారు. ఎయిర్ పోర్టు నుంచే ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపేందుకు .

అందరూ విమానాశ్రయానికి పెద్ద ఎత్తున చేరుకోవాలని పిలుపునిచ్చారు. అంతా కలిసి భారత రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా మన గొంతు వినిపించాల్సిన సమయం వచ్చిందన్న అభిజీత్ దిప్కే ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలు చేపట్టడానికి అనుమతి కోరతామని వెల్లడించారు.

దీంతో జూన్ 6న జరగబోయే నిరసనలపైనే అందరి దృష్టీ నెలకొంది. గత నెల 15న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party) పుట్టుకొచ్చింది. ఉపాధి లేని కొందరు యువతను ఆయన బొద్దింకలు, సమాజ పరాన్నజీవులుగా అభివర్ణించడం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనికి వ్యంగ్యంగా ఈ పార్టీని ఏర్పాటు చేశారు.

నిరుద్యోగులు, ఆన్‌లైన్‌లో ఉండేవాళ్లు, వ్యవస్థలను విమర్శించే వారి కోసం బద్ధకస్తులు, నిరుద్యోగుల గొంతుక అనే ట్యాగ్‌లైన్‌తో దీనిని ప్రారంభించారు. సోషల్ మీడియాలో సీజేపీ అకౌంట్ ప్రారంభించిన గంటల వ్యవధిలోనే మిలియన్ల ఫాలోవర్లు రావడం సంచలనంగా మారింది. అధికార బీజేపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా అకౌంట్లను సైతం దాటేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

అయితే తర్వాత సీజేపీ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ కావడం మరింత దుమారానికి కారణమైంది. దీనిపై ప్రస్తుతం ఢిల్లీ కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. అదే సమయంలో సీజేపీ ఈజ్ బ్యాక్ అనే కొత్త అకౌంట్ తో అభిజీత్ మరోసారి హల్ చల్ చేశారు. ఇటీవల నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వడంతో కాక్రోచ్ పార్టీ(Cockroach Janta Party) మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Annamalai : తమిళనాట మరో కొత్త పార్టీ ?..బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న అన్నామలై

Exit mobile version