Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్..ఈసారి పాస్ అయ్యేలా వ్యూహం

Delimitation Bill : వర్షాకాల సమావేశాలలో డీలిమిటేషన్ బిల్లును ప్రభుత్వం మరోసారి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

Delimitation Bill

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి జరగబోతున్నాయి. ఈసారి సభ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి. దీనిలో ముఖ్యమైనది డీలిమిటేషన్ బిల్లు(Delimitation Bill). కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు ఈ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

అయితే, పార్లమెంట్‌లో మెజారిటీ లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. ఇప్పుడు వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రభుత్వం మరోసారి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.

సాధారణంగా రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన వారిలో కనీసం మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలి. ఏప్రిల్ సమావేశాల్లో ఓటింగ్‌ నిర్వహించినప్పుడు బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు పాస్ కావడానికి 352 ఓట్లు అవసరమవగా 54 ఓట్లు తక్కువ రావడంతో బిల్లు వీగిపోయింది.

మహిళా బిల్లును సైతం నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో ముడిపెట్టి ప్రవేశపెట్టినా కేంద్రం బిల్లును ఆమోదింపజేసుకోలేకపోయింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో సీట్లను కోల్పోతాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. : జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు అత్యధికంగా సీట్లు పెరుగుతాయని, దీనివల్ల కేంద్ర రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాయి.

అయితే కేంద్రం వాదన మరోలా ఉంది. ఈ పునర్విభజన వల్ల దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని, సీట్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని ప్రాంతాలకూ మేలు జరుగుతుందని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై ఇటీవల కేంద్రానికి మరికొన్ని కీలక సూచనలు చేసింది.

Delimitation Bill

దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను 824కు పెంచాలని ప్రతిపాదించింది.మారుతున్న పట్టణీకరణ, జనాభా నమూనాలకు అనుగుణంగా పెద్ద రాష్ట్రాలలో సీట్లను 50 శాతం పెంచాలని పేర్కొంది. ఈసారి బిల్లు పాస్ అయ్యేలా చూసేందుకు మోదీ , అమిత్ షా పట్టుదలగా ఉన్నారు. దీని కోసం తృణమూల్ కాంగ్రెస్ , డీఎంకే వంటి ప్రతిపక్ష కూటమిలోని కీలక ప్రాంతీయ పార్టీలతో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది.

ఆయా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సీట్లు భారీగా పెరుగుతాయి కాబట్టి, ప్రాంతీయ పార్టీలు అంతర్గతంగా ఈ ప్రతిపాదన వైపు మొగ్గు చూపేలా వ్యూహాత్మక రాయబారాలు నడుపుతున్నారు. విపక్షాలు మాత్రం దీనిని కేంద్రం రాజకీయ అస్త్రంగా అభివర్ణిస్తున్నారు. మరోవైపు 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలనే పట్టుదలతో మోదీ, అమిత్ షా ఈ డీలిమిటేషన్(Delimitation Bill) ప్రక్రియను ముగించేలా తెరవెనుక పావులు కదుపుతున్నారు.

Ashadam : జూలై 15 నుంచి ఆషాఢం..ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలివే..

Exit mobile version