Just SpiritualLatest News

Ashadam : జూలై 15 నుంచి ఆషాఢం..ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలివే..

Ashadam : ఆషాఢ మాసమనేది కేవలం ఒక నెల మాత్రమే కాదు, అది మనిషికి అంతర్గత ప్రశాంతతను అలవర్చే ఒక చక్కటి సమయంగా భావిస్తారు.

Ashadam

జూలై 15వ తేదీ నుంచి ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన నెలగా చెప్పుకునే ఆషాఢ మాసం మొదలుకాబోతోంది. హిందూ సంప్రదాయంలో ఈ నెలతో పాటు వర్షాకాలం కూడా ఊపందుకుంటుంది. సాధారణంగా ఈ మాసంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు చేయకపోయినా… దైవచింతన, జపతపాలు, వ్రతాలు, దానధర్మాలకు మాత్రం ఈ నెల అత్యంత అనుకూలమైన సమయం.

అందుకే ఆషాఢ మాసాన్ని.. సాధన మాసం అని కూడా పిలుస్తారు. పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రాల పరిధిలో ఉంటుండటం వల్లే ఈ నెలకు ఆషాఢం అనే పేరు వచ్చింది.ఈ నెలలో ముఖ్యమైన పండుగలు, పుణ్యతిథుల గురించి ఎంతోమంది ఎదురుచూస్తుంటారు.

ఈ జూలై నెలలో ఖగోళ పరంగా ఒక కీలకమైన మార్పు చోటుచేసుకోనుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ తన ప్రయాణాన్ని ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు మారుస్తాడు. ఈ 6 నెలల కాలాన్నే దక్షిణాయనం అంటారు.

పురాణాల ప్రకారం ఉత్తరాయణం.. దేవతలకు పగలైతే, దక్షిణాయనం..వారికి రాత్రి కాలంతో సమానం. అందుకే ఈ పవిత్ర ఆషాఢ మాస సమయంలో పితృదేవతలకు తర్పణాలివ్వడం, పూజలు, వ్రతాలు చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని పండితులు చెబుతారు.

ఈ మాసంలో వచ్చే ఆషాఢ పౌర్ణమిని వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమగా భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. లోకానికి వేదాలు, పురాణాలతో పాటు మహాభారతాన్ని అందించిన వేదవ్యాస మహర్షి జన్మించిన పవిత్ర దినం ఈ గురు పూర్ణిమ.

ఈ రోజు తమకు విద్య నేర్పిన గురువులను గౌరవించడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ధ్యానం చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు, ఎంతో మంది సాధువులు, సన్యాసులు తమ చాతుర్మాస్య దీక్షను ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు.

ఈ జూలై నెలలో ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. జూలై 3వ తారీఖున వినాయకుడి పూజకు విశిష్టమైన సంకటహర చతుర్థి వస్తుంది. ఆ తర్వాత జూలై 10వ తేదీన యోగిని ఏకాదశి, జూలై 12వ తేదీన మాస శివరాత్రి , ప్రదోష వ్రతం ఉంటాయి.

Ashadam
Ashadam

జూలై 15 నుంచి అధికారికంగా ఆషాఢ(Ashadam) మాసం ప్రారంభం కాగా, ఆ మరుసటి రోజు అంటే జూలై 16వ తేదీన జగన్నాథ స్వామి రథయాత్ర ఎంతో వైభవంగా సాగుతుంది. ఇక జూలై 25వ తేదీన అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి (దేవశయని ఏకాదశి) కాగా, జూలై 26వ తేదీన ప్రదోష వ్రతం , జూలై 29 తేదీన గురుపూర్ణిమ వస్తాయి.. ఆషాఢం ప్రారంభానికి ముందు, అంటే జూలై మొదటి వారంలో కొన్ని రోజులు మాత్రమే కొత్త పనులు ప్రారంభించడానికి శుభ ముహూర్తాలు ఉన్నాయి.

ఆషాఢ(Ashadam) మాసమనేది కేవలం ఒక నెల మాత్రమే కాదు, అది మనిషికి అంతర్గత ప్రశాంతతను అలవర్చే ఒక చక్కటి సమయంగా భావిస్తారు. బాహ్యమైన ఆడంబరాలకు దూరంగా ఉంటూ, భగవన్నామ స్మరణ, గురుసేవ, దానధర్మాలు చేయడం ద్వారా మానసిక శక్తిని పెంచుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

Amarnath Yatra : రేపటి నుంచే అమర్‌నాథుడి దర్శనం.. వెళ్లాలనుకుంటే మాత్రం ఈ 5 జాగ్రత్తలు పాటించాల్సిందే..

Related Articles

Back to top button