Cheque Bounce
వ్యాపార లావాదేవీలు లేదా అప్పు తీసుకోవడం వంటి విషయాల్లో చెక్ ఉపయోగించడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఆ చెక్ పై సంతకం చేసి అవతలి వ్యక్తికి ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకున్నా, సంతకం కుదరకపోయినా చెక్ బౌన్స్ అయితే మాత్రం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఒకవేళ తప్పు రుజువైతే మాత్రం సెక్షన్ 138 కింద కోర్టు మెట్లు ఎక్కి చివరికి జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే చెక్ మీద సంతకం పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించి, అవతలి వ్యక్తికి ఇవ్వండి. అమౌంట్ లేక చెక్ బౌన్స్ అయితే గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది.
నిజానికి ప్రస్తుత రోజుల్లో అంతా ఆన్ లైన్ లావాదేవీలే నడుస్తున్నా కూడా పలు సందర్భాల్లో మాత్రం చెక్ అత్యంత నమ్మదగినదిగా ఉంటుంది. అయితే చెక్ మీద సంతకం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 138 ప్రకారం చెక్ బౌన్స్ ఇప్పుడు క్రిమినల్ కేసుగా పరిగణిస్తారు.
బ్యాంకింగ్ లావాదేవీలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఒక వ్యక్తి తన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అప్పు తీసుకున్న వ్యక్తికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే దానిని నేరంగా పరిగణిస్తారు. బ్యాంక్ అకౌంట్ లో సరిపడా డబ్బు లేకపోవడం , చెక్కు క్లియర్ కాకముందే ఖాతాను క్లోజ్ చేయడం , సంతకంలో తేడాలు, సాంకేతిక లోపాలతో పాటు చెల్లింపులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం వంటివి చెక్ బౌన్స్ కు కారణమవుతాయి.
చెక్ పై ఉన్న తేదీ నుండి 3 నెలల్లోపు దానిని బ్యాంకులో జమ చేయాలి. ఖాతాలో సరిపోయే అమౌంట్ లేకుంటే బ్యాంక్ దానిని తిరస్కరిస్తూ మెమో ఇస్తుంది. ఈ మెమో అందిన 30 రోజుల్లోపు డబ్బు రావాల్సిన వ్యక్తి అవతలి వ్యక్తికి లీగల్ నోటీసు పంపాలి. నోటీసు అందిన 15 రోజుల్లోపు చెక్కు ఇచ్చిన వ్యక్తి స్పందించి చెల్లింపు చేయకుంటే కోర్టులో కేసు దాఖలు చేసే అవకాశం ఉంటుంది.
ఒకవేళ సెక్షన్ 138 కింద దోషిగా తేలితే గరిష్టంగా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చెక్కుపై ఉన్న మొత్తం కంటే రెండు రెట్లు జరిమానా కట్టాల్సి రావచ్చు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష, జరిమానా రెండూ విధించే పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే ఖాళీ చెక్కులపై ఆలోచించకుండా ఇష్టానుసారం సంతకాలు పెట్టి ఎవ్వరికీ ఇవ్వొద్దు. ఒకవేళ లావాదేవీలకు సంబంధించి చెక్కులు ఇస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి.
OTT : ట్విస్టులకు కేరాఫ్ అడ్రస్..ఈ ఓటీటీ థ్రిల్లర్ ను అస్సలు మిస్సవ్వొద్దు
