Living Relationship
ఈ రోజుల్లో సహజీవనం చాలా సర్వసాధారణంగా మారిపోయింది. చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం కోసం వేరే నగరానికి వచ్చి కలిసుంటున్నారు. పైగా కోలివింగ్ హాస్టల్స్ కూడా పెరిగిపోవడంతో విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. కొన్ని రోజులు బాగానే సాగుతున్నా తర్వాత మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు.
అదే సమయంలో అమ్మాయిలు, మోసం చేసాడంటూ అబ్బాయిలపై కేసు పెట్టి కోర్టుకెళ్లడం కూడా చూస్తున్నాం. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువైపోతుండడం కోర్టులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంలో సహజీవనం(Living Relationship) చేసి తర్వాత మోసం చేసాడంటూ కేసు పెట్టే అమ్మాయిలకు అలహాబాద్ హైకోర్టు షాకిచ్చింది.
కొన్నేళ్ల పాటు కలిసి తిరిగి, బాగా సాన్నిహిత్యం పెంచుకుని గొడవలు మొదలైన తర్వాత ఇలా కోర్టులకు రావడంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య సుదీర్ఘకాలం పాటు పరస్పర అంగీకారంతో సాగిన బంధాన్ని, పెళ్లి మాట నిలబెట్టుకోలేదనే కారణంతో అత్యాచారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఒక యువతి దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.
ఈ విధమైన సంబంధాలు విఫలమైనప్పుడు వాటిని క్రిమినల్ నేరాలుగా మార్చడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు నిందితుడిపై ఉన్న అత్యాచారం సహా అన్ని క్రిమినల్ కేసులను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది.
ఈ కేసు వివరాలను చూస్తే ప్రతాప్‌గఢ్‌కు చెందిన ఒక యువతి పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేందుకు 2014లో ప్రయాగ్‌రాజ్ వచ్చింది. ఆమెకు దూరపు బంధువైన సంజయ్ సరోజ్ ఆ సమయంలో సాయం చేశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఐదేళ్ల పాటు ఇద్దరూ సహజీవనం(Living Relationship) చేశారు.
2019లో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోదామని సంజయ్ ప్రతిపాదించగా దీనిని వ్యతిరేకించిన యువతి స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ప్రేమ పేరుతో శారీరకంగా దగ్గరై నమ్మించి మోసం చేసాడనీ, పెళ్లి చేసుకోమంటే బెదిరిస్తున్నాడంటూ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద సంజయ్ పై కేసు నమోదు చేశారు.
విచారణ జరిపి నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దీనిపై సంజయ్ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం కేసు వివరాలను పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేసింది. యువతిపై ఎలాంటి శారీరక గాయాలు లేవని వైద్య పరీక్షల్లో తేలిందని పేర్కొంది. పెళ్లి చేసుకోవాలంటూ వరుడిని బలవంతం చేసేందుకే కేసు పెట్టినట్టు అర్థమవుతోందని పేర్కొంది.
పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండా, కేవలం మోసం చేయడానికే అబద్ధపు వాగ్దానం చేసినప్పుడు మాత్రమే అది అత్యాచారం కిందకు వస్తుందని గుర్తు చేసింది. ఈ కేసులో ఆ పరిస్థితి కనిపించడం లేదని వ్యాఖ్యానించింది.దీనిని అరుదైన కేసుగా పేర్కొంటూ ఇలాంటి పరిస్థితుల్లో విచారణను కొనసాగించడం న్యాయం కాదని చెబుతూ కేసును డిస్మిస్ చేసింది.
Diabetes : నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారా? డయాబెటిస్‌కు, నిద్రకు ఉన్న లింక్ తెలిస్తే షాకే..
