TVK Vijay
ఏ ముహూర్తాన తమిళ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో తెలీదు కానీ అడుగడుగునా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత ఏడాది తొక్కిసలాట ఘటన నుంచి ఈ ఏడాది తన చివరి సినిమా విడుదల కాలేకపోవడం, తర్వాత ఆన్ లైన్లో మొత్తం సినిమా లీక్ అవ్వడం, ఇటు వ్యక్తిగత అంశాలపై వివాదాలు, విడాకుల కోసం భార్య కోర్టుకెళ్లడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాడు.
తాజాగా దళపతికి(TVK Vijay) మరో చిక్కు వచ్చి పడింది.ఎన్నికల అఫిడవిట్ లో తేడాలుండడంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాలకు సంబంధించి భారీ వ్యత్యాసం ఉందంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం వివరాలు పరిశీలించాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.
తొలిసారి ఎన్నికల బరిలోకి నిలిచిన విజయ్(TVK Vijay) తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. నామినేషన్ల సందర్భంగా అఫిడవిట్లు సమర్పించగా వాటిలో తేడాలున్నట్టు వెల్లడైంది. తిరుచ్చిలో సమర్పించిన అఫిడవిట్ పత్రాల్లో విజయ్ తన ఆదాయం రూ. 220 కోట్లుగా చూపించారు. అలాగే పెరంబూర్‌లో సమర్పించిన అఫిడవిట్‌లో ఆ ఆస్తుల విలువ రూ. 115 కోట్లుగా పేర్కొన్నారు.
కొన్ని రోజుల వ్యవధిలో దాఖలైన రెండు అఫిడవిట్ల మధ్య రూ.105 కోట్లు తేడా ఉండడం ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ తేడాకు సంబంధించి విజయ్ ఎలాంటి పత్రాలు సమర్పించలేదని, వివరణ కూడా ఇవ్వలేదని సదరు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు విజయ్ ఆస్తుల వివరాలు పరిశీలించమంటూ ఆదాయపు పన్ను శాఖ అధికారులను ఆదేశించింది.
ఇదిలా ఉంటే విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట ట్రయాంగిల్ ఫైట్ జరుగుతోంది. విజయ్ తన టీవీకే పార్టీని ఒంటరిగానే పోటీలోకి దింపుతున్నాడు. విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తుండగా… తిరుచ్చి ఈస్ట్‌లో డీఎంకే అభ్యర్థి ఇనిగో ఇరుదయరాజ్‌తో, పెరంబూర్‌లో డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.డి. శేఖర్‌తో తలపడుతున్నారు.
తిరుచ్చి ఈస్ట్‌లో క్రైస్తవ మైనారిటీల ఓట్లు అధికంగా ఉన్నాయి. విజయ్ ఇదే రంగంలో ఉండటంతో డీఎంకేకు పడే మైనారిటీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే విజయ్ తన ప్రచారాన్ని ప్రధానంగా రామనాథపురం వంటి తీర ప్రాంతాలపై కేంద్రీకరించి.. మైనారిటీ, మత్స్యకార వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా తమిళనాడులో ఏప్రిల్ 23వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
Airport : ఏపీలో ఎయిర్‌పోర్టుల జోరు.. ఏ జిల్లాలో ఏయే ఎయిర్‌పోర్టులు ఉన్నాయో తెలుసా?
