Parandur Airport Project
తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గరలో గతంలో ప్రకటించిన పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అంశం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తోంది. చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరందూర్ ప్రాంతంలో బహుళ పంటలు పండే వ్యవసాయ భూములతో పాటు, స్థానిక జలాశయాలు,కొన్ని కీలకమైన పర్యావరణ వ్యవస్థలు కూడా దెబ్బతింటాయంటూ రైతులు, స్థానికులు ఎంతో కాలంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
ఈ విషయంలో నిరసనకారులకు మొదటి నుంచీ మద్దతుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్.. అధికారం చేపట్టాక అందరిలా మాట మార్చకుండా ఆ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్(Parandur Airport Project)ను పూర్తిగా విరమిస్తున్నట్లు ప్రకటించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో, అలాగే అక్టోబర్ 2024లో విక్రవాండిలో జరిగిన ముఖ్యమైన సమావేశంలో కూడా విజయ్ ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్‌కు , కనెక్టివిటీకి ఎయిర్‌పోర్టుల నిర్మాణం అవసరమే అయినా.. రెక్కలు ముక్కలు చేసుకునే రైతుల సంక్షేమాన్ని పణంగా పెట్టి మాత్రం వాటిని నిర్మించడం అసల కరెక్ట్ కాదని ఆయన తేల్చిచెప్పారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీకి కట్టుబడిన విజయ్.. పరందూర్ కొత్త ఎయిర్‌పోర్టుకు ఏర్పాటుకు సంబంధించి గతంలో మొదలుపెట్టిన అన్ని రకాల చర్యలు, ప్రతిపాదనలను విత్ డ్రా చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రాంత రైతాంగం, నిరసనకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్ ప్రతిపాదిత స్థలాన్ని మరోసారి సమీక్షించనున్నట్లు టీవీకే నేత సీటీఆర్ నిర్మల్ కుమార్ తెలిపారు. వ్యవసాయ భూములు, నీటి వనరులకు ఎలాంటి ముప్పు లేకుండా ప్రత్యామ్నాయ ప్రాంతాలను అన్వేషించడానికి పక్కా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మాజీ సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రతిపక్ష డీఎంకే తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ పాలన సమయంలో తీసుకొచ్చిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌పై అనవసర అనుమానాలనే రేకెత్తించడం సరికాదని, ధైర్యముంటే దానికి సంబంధించిన ఫైళ్లను బయటకు తీసి ఓపెన్ చేయాలని విజయ్ సర్కార్‌కు సవాలు విసురుతోంది.
డీఎంకే సీనియర్ నాయకుడు దురైమురుగన్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. వారం రోజుల్లోగా ఎయిర్‌పోర్ట్ ఫైళ్లను బహిర్గతం చేయకపోతే, అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే కోణంలో ఆయనపై ప్రివిలేజ్ మోషన్ అంటే సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ప్రవేశపెడతామని హెచ్చరించారు.
గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్న కాలంలో కావేరి డెల్టా ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకున్న షేల్ గ్యాస్, కోల్ బెడ్ మీథేన్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. దీంతో రైతుల అభిప్రాయానికి ప్రాధాన్యమిచ్చిన అప్పటి సీఎం జయలలిత ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టడమే కాకుండా.. కావేరి డెల్టాను రక్షిత వ్యవసాయ మండలిగా ప్రకటించే దిశగా కీలక అడుగులు వేశారు.
అలాగే పశ్చిమ బెంగాల్‌లో సింగూర్, నందిగ్రామ్ ప్రాంతాల్లో టాటా మోటార్స్ కార్ల కర్మాగారంతో పాటు ఎస్‌ఈజెడ్ కోసం వ్యవసాయ భూముల సేకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాడినప్పుడు మమతా బెనర్జీ అపోజిషన్ లీడర్‌గా వారికి అండగా నిలిచారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక సింగూర్ భూసేకరణను రద్దు చేయడంతో పాటు ఆ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఫ్రీ కరెంట్, అగ్రికల్చర్ లోన్ మాఫీ, రైతుల భూముల పరిరక్షణ విషయంలో రైతాంగానికి అనుకూలంగా జీవోలు తెచ్చిన సందర్భాలున్నాయి.
పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం సారవంతమైన భూములను సేకరించేటపుడు రైతుల నిరసనల తీవ్రతను బట్టి ముఖ్యమంత్రులు తమ నిర్ణయాలను సమీక్షించుకుంటూ.. ప్రాజెక్ట్ స్థలాలను మార్చడం లేదంటే రద్దు చేయడం వంటివి చేశారు.
తాజాగా ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్(Parandur Airport Project) రద్దు డెసిషన్ కూడా ఈ వరుసలోనే నిలబడి.. తమిళనాడు రాజకీయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మొత్తంగా రైతుల విజయం ఒకవైపు ఉంటే, మరోవైపు టీవీకే అండ్ డీఎంకే మధ్య పొలిటికల్ హీట్ వేరే లెవెల్‌కు చేరిందా అన్నట్లుగా అక్కడ పరిస్థితులు మారాయి.
Yellow Alert : తెలుగు రాష్ట్రాలకు అల్పపీడన ముప్పు..ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు ఇవే..
