Sharad Pawar
మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో చీలికలు రాబోతున్నట్టు అర్థమవుతోంది. ఆ కూటమిలో కీలకంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad Pawar) ఎన్డీఏలో చేరబోతున్నారన్న ప్రచారం కొన్నిరోజులుగా జరుగుతోంది. దీనిని ఆ పార్టీ వర్గాలు ఖండించినా వరుస పరిణామాలు చూస్తే ఆ దిశగానే అడుగులు పడుతున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కార్యాలయానికి శరద్ పవార్ స్వయంగా వెళ్లి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఇది మర్యాదపూర్వక భేటీనేనని చెబుతున్నా రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది.
షిండే చాంబర్‌లో శరద్ పవార్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో ఈ భేటీ మరింత హాట్ టాపిక్ గా మారింది. అయితే విపక్ష ఎమ్మెల్యేలు కూర్చునే గది చాలా దూరం ఉండటంతో, పవార్ నడవడానికి ఇబ్బంది పడకుండా ఎగ్జిట్ దగ్గరలో ఉన్న షిండే కేబిన్‌ను వాడుకున్నట్లు ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ వివరణ ఇచ్చారు.
మరోవైపు కొద్దిసేపటికే ఈ భేటీపై మహా వికాస్ అఘాడీ కూటమి భాగస్వామి అయిన శివసేన (యూబీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని పడగొట్టిన ద్రోహి ఆఫీసును శరద్ పవార్ సందర్శించడం అత్యంత ఆక్షేపణీయమని సంజయ్ రౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది ద్రోహులను గౌరవించినట్లే అవుతుందని ..ఈ చర్య వల్ల పవార్ విశ్వసనీయత దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. తమ కూటమి మిత్రపక్షాలన్నీ ఏక్‌నాథ్ షిండేకు దూరంగా ఉండాలని సూచించారు.
మరోవైపు కొంత కాలంగా ప్రతిపక్ష కూటమితో ఎన్సీపీ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది. వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వ సహకారం అవసరం కావడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పవార్‌పై ఒత్తిడి చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
ఎన్సీపీ-ఎస్పీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిధుల కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం నుంచి నిధులు అందాలంటే అధికార పక్షంతో సత్సంబంధాలు కలిగి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా శరద్ పవార్, షిండే భేటీ ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది.
Bandi Bhagirath : బండి భగీరథ్‌కు బిగ్ రిలీఫ్ ..షరతులతో బెయిల్ మంజూరు
