Bandi Bhagirath
తెలంగాణలో సంచలనంగా మారిన బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. లక్ష పూచీకత్తుతో ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశించింది. కొన్ని కీలక షరతులు కూడా విధించింది.
ఈ కేసు విచారణ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని బండి భగీరథ్‌ను ఆదేశించింది. విచారణకు అవసరమైన సమయంలో దర్యాప్తు అధికారులతో పూర్తిగా సహకరించాలని సూచించింది. ఒకవేళ హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దయ్యే అవకాశముంటుంది.
కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ్(Bandi Bhagirath) పోక్సో కేసులో మే 16న అరెస్ట్ అయ్యారు. మైనర్ బాలికను స్నేహం పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసగించి లైంగిక వేధింపులకు గురి చేసారన్నది భగీరథ్‌పై ప్రధాన ఆరోపణ. బాలిక తల్లి దీనిపై పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక వాంగ్మూలం తర్వాత కఠినమైన పోక్సో సెక్షన్ 5(1) ను అదనంగా జోడించారు.
అయితే బాలిక తల్లి ఫిర్యాదు చేసిన రోజే బండి భగీరథ్ తరఫున కూడా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు నమోదైంది. బాలిక కుటుంబం బండి భగీరథ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని, ఆయన నిరాకరించడంతో డబ్బు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా పరస్పర ఫిర్యాదులతో ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ సారథ్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణను వేగవంతం చేశారు. సిట్ బృందం చాలాసార్లు బాలిక, ఆమె తల్లి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. భగీరథ్ స్నేహితులను , ఇతర సాక్షులను విచారించారు.
మరోవైపు బెయిల్ కోసం భగీరథ్(Bandi Bhagirath) హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిందితుడి తండ్రి కేంద్రమంత్రి కావడంతో సాక్షులను ప్రభావితం చేస్తారని బాధితురాలి తరపు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. అయితే హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఈ కేసులో తప్పు చేస్తే తన కుమారుడైనా సరే శిక్ష పడాల్సిందేనని బండి సంజయ్ ఇది వరకే స్పష్టం చేశారు. ప్రస్తుతానికి కేసు విచారణ దశలో ఉండడంతో ఇంతకుమించి మాట్లాడలేనని ఇప్పటికే చాలాసార్లు బండి సంజయ్ వివరణ ఇచ్చారు.
2000 Rupee Notes : ఇంకా 6 వేల కోట్ల రూపాయల 2000 నోట్లు జనాల దగ్గరే.. మార్చుకోవడానికి ఇంకా టైమ్ ఉందా?
