Tamil Nadu
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న తమిళనాడు(Tamil Nadu)లో ఈసారి రికార్డు స్థాయి పోలింగ్ నమోదవుతోంది. ఓటర్లు భారీస్థాయిలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎన్నడూ లేనంతగా తొలి నాలుగు గంటల్లోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 11 గంటల వరకూ ఏకంగా 38 శాతం నమోదవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
గతంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాలేదు. ముఖ్యంగా మహిళలు, యువత ఓట్లు వేసేందుకు బారులు తీరారు. 7 గంటల నుంచే పోలింగ్ ఉత్సాహంగా మొదలైంది. ఎటు చూసినా బారులు తీరిన లైన్లు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం ఈ ఓటింగ్ శాతాన్ని చూసి షాకవుతున్నాయి. నిజానికి ఈ సారి ముక్కోణపు పోటీ నెలకొంది.
డీఏంకే, అన్నాడీఏంకే కూటమిలతో పాటు నటుడు విజయ్ తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. టీవీకే పార్టీ పెట్టి కొన్ని రోజులే అయినా అన్ని నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీచేస్తున్నారు. విజయ్ పూర్తిస్థాయిలో ప్రభావం చూపడని చాలా అంచనాలు తేల్చినా ప్రస్తుతం ఓటింగ్ శాతం నమోదవుతున్న తీరు చూస్తుంటే సంచలన ఫలితాలు వెలువడే అవకాశాలను కొట్టిపారేయలేం.
ఉదయం 7 గంటలకు 17.69 శాతం పోలింగ్ నమోదవగా… 11 గంటలకు మరో 20 శాతం పెరిగింది. అత్యధికంగా కుమారపాళయంలో 45.87 శాతం నమోదైంది. అత్యల్పంగా పాలయంకోట్టై 30.73 శాతం ఓటింగ్ శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే చెన్నైలో 35.47 శాతం నమోదైనట్టు తెలుస్తోంది. సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే అటు బెంగాల్ లో సైతం ఓటర్లు పోటెత్తారు. ఉదయం 11 గంటల వరకు 40 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. బెంగాల్ లో కూడా మహిళలు, యువ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇప్పటి వరకూ నమోదైన పోలింగ్ శాతం ప్రకారం చూస్తే సాయంత్రానికి గతంలో కంటే అత్యధికంగా నమోదవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
బెంగాల్ లో తొలి విడత కు సంబంధించి 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. అటు తమిళనాడు(Tamil Nadu)లో మాత్రం ఒకదశలోనే పూర్తి 234 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. మే 4న కౌంటింగ్ జరగనుంది.
Watermelon : అతిగా పుచ్చకాయ తింటున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందట!
