Lift Safety
ఒకప్పుడు సిటీలో మాత్రమే కనిపించే అపార్ట్‌మెంట్‌లు, లిఫ్టులు ఇప్పుడు చిన్నచిన్న ఊళ్లలోనూ కామన్‌గా మారాయి. ఎలివేటర్లలోకి అడుగుపెట్టేవారు తమ ప్రాణ భద్రతను పూర్తిగా ఆ వ్యవస్థకే అప్పగిస్తారని.. అందుకే భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీకి తావు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లిఫ్ట్‌లను కూడా బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా సాధనాలుగా అంటే కామన్ క్యారియర్లుగా పరిగణించాల్సిన అవసరం ఉందంది.
ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ తయారీదారులు, లిఫ్ట్ నిర్వహణ(Lift Safety) ఏజెన్సీలు, బిల్డింగ్ యజమానులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ తమ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించిన సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
2003లో ఆర్అండ్ఏడబ్ల్యూ మెయిన్ ఆఫీస్‌లో జరిగిన ప్రమాదంలో కూడా లిఫ్ట్ తయారీ కంపెనీ వోల్టేజ్ సమస్యలను సాకుగా చూపించగా.. నిర్వహణ విభాగం సరైన రెస్క్యూ విధానం పాటించలేదని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ నేరం నుంచి తప్పించుకోవాలని చూశారు.
చాలా కేసులలో ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో.. బాధితులు, వారి కుటుంబ సభ్యులు తమకు పరిహారం కావాలంటే ఎవరి వద్దకు వెళ్లాలో తెలీక ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సిట్యువేషన్‌కు స్వస్తి పలకడానికే సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పునిచ్చింది.
ఈ ముగ్గురినీ ఉమ్మడిగా బాధ్యులను చేయడం ద్వారా.. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే బాధితులు తమ పరిహారాన్ని ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి నుంచి అయినా పూర్తి మొత్తంలో వెంటనే వసూలు చేసుకునే హక్కును కల్పించింది. ఆ తర్వాత ఆ ముగ్గురూ తమ అంతర్గత వాటాల ప్రకారం ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా వందలాది లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నా సరే.. వాటిలో చాలా కేసులు లోకల్ వినియోగదారుల ఫోరమ్‌లు, హైకోర్టులలో ఏళ్ల తరబడి నానుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే ఈ లిఫ్ట్ నిబంధనల ఉల్లంఘన, నిర్వహణ లోపాలపైన వందలు, వేల కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో లిఫ్ట్ తయారీ కంపెనీలు రెగ్యులర్‌గా తనిఖీలు చేయకపోయినా, బిల్డింగ్ యజమానులు సరైన ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు తీసుకోకపోయినా భారీ ఫైన్‌లు, నష్టపరిహారాలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో అయినా ఫ్యూచర్‌లో జరిగే అనేక ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది.
