Womens Reservation Bill
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు(Womens Reservation Bill) లోక్ సభ ఆమోదం పొందలేకపోయింది. రెండురోజుల చర్చ అనంతరం లోక్ సభలో ఓటింగ్ నిర్వహించారు. ముందు నుంచీ అనుకున్నట్టుగానే విపక్షాలు దీనిని వ్యతిరేకించాయి. మహిళా బిల్లుకు(Womens Reservation Bill) వ్యతిరేకం కాకున్నా డీలిమిటేషన్ బిల్లుతో కలిపి దీనిని ప్రవేశపెట్టడాన్ని అంగీకరించలేదు.
విడివిడిగా పెట్టాలని కోరగా ఎన్డీఏ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఓటింగ్ లో ఓడించి తీరతామంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే ఓటింగ్ లో బిల్లు ఆమోదం పొందలేదు. మొత్తం 540 మంది సభ్యులకు గానూ 489 మంది మాత్రమే ఓటింగ్ లో పాల్గొన్నారు. వీరిలో బిల్లుకు అనుకూలంగా 278 మంది, వ్యతిరేకంగా 211 మంది ఓటు వేశారు. బిల్లు పాసవ్వాలంటే 489 మందిలో 2/3 మెజారిటీ అంటే 326 ఓట్లు రావాల్సి ఉంది.
కానీ అనుకూలంగా 278 మంది మాత్రమే ఓటు వేశారు. దీంతో అవసరమైన మెజారిటీ సాధించకపోవడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదు. అటు మిగిలిన రెండు బిల్లులకు ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకపోవడంతో కేంద్రం వాటిని వెనక్కి తీసుకుంది.
ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రకటన చేశారు. అంతకుముందు జరిగిన చర్చలో అధికార , విపక్ష కూటమి సభ్యులు బిల్లుపై తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని మరోసారి విపక్ష సభ్యులు తమ గళాన్ని వినిపించారు.
దీనిపై పలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. అయితే విపక్షాల వాదనతో ఏకీభవించని కేంద్రం బిల్లులో పెట్టని 50 శాతం సీట్ల పెంపు నిబంధనను అమలు చేస్తామని స్పష్టం చేసింది. దీనికి విపక్షాలు అంగీకరించలేదు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగాన్ని విపక్షాలు పదే పదే అడ్డుకున్నాయి.
అయితే గంటలో బిల్లును మార్పులు చేసి ప్రవేశపెడితే మద్దతు ఇస్తారా అని అమిత్ షా సవాల్ విసరడంతో సభలో గందరగోళం నెలకొంది. చివరికి తమ రెండు డిమాండ్లను అంగీకరించకపోవడంతో విపక్షాలు ఓటింగ్ లో పైచేయి సాధించాయి. కాగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపునకు ప్రతిపాదిస్తూ కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చింది.
దీని ప్రకారం ప్రస్తుత 543 స్థానాలను 850కి పెంచాలని ప్రతిపాదించారు. కానీ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని విపక్షాలు విమర్శించగా.. కేంద్రం అలాంటిదేమీ లేదని పేర్కొంది. మొత్తం మీద మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill) ఆమోదం పొందకపోవడం ఎన్డీఏ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే చెప్పాలి.
RCB vs DC : బెంగళూరుకు ఎదురుందా ?…ఢిల్లీ క్యాపిటల్స్ తో బిగ్ ఫైట్
