Cockroach Janta Party
కాక్రోచ్ జనతా పార్టీ…కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా నిలిచిన పార్టీ.. దేశంలో నిరుద్యోగం, పేపర్ లీకులు, విద్యావ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా యువత ప్రారంభించిన ఒక వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీని అభిజీత్ దీప్కే స్థాపించారు.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న కాక్రోచ్ జనతా పార్టీ(Cockroach Janta Party) కొన్ని ప్రధాన నగరాల్లో నిరసనలు కూడా నిర్వహించింది. అమెరికా నుంచి స్వయంగా వచ్చి మరీ అభిజీత్ దీప్కే నిరసనల్లో పాల్గొన్నారు. అయితే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర 11 రోజులుగా కొనసాగుతున్న నిరాహారదీక్షకు మాత్రం స్పందన కరువైంది.
నిరసన దీక్షలకు సోషల్ మీడియాలో ఉన్నంత స్పందన క్షేత్రస్థాయిలో కరవైందనే చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో సంచలనం సృష్టించిన ఈ వ్యంగ్య రాజకీయ ఉద్యమం వీధుల్లోకి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో జన సమీకరణ చేయలేకపోతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న దీక్షలకు పగటిపూట కేవలం 200 నుంచి 300 మంది మాత్రమే హాజరవుతున్నారు. సామాజిక, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్‌చుక్ స్వయంగా ఈ నిరసనల్లో పాల్గొని మద్దతు ప్రకటించినా, ఆశించిన స్థాయిలో సాధారణ ప్రజల భాగస్వామ్యం లభించట్లేదు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న దీక్షా శిబిరానికి మద్దతుదారుల సంఖ్య తక్కువగానే కనిపించింది. మొదట్లో హడావుడి చేసిన నిరుద్యోగులు ఇప్పుడు నిరసన దీక్షను పట్టించుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల హైదరాబాద్, ఇతర నగరాల్లో జరిగిన ఆందోళనల్లో కూడా ఆన్‌లైన్ హడావుడికి తగ్గట్టుగా జనం రాలేదు. సోషల్ మీడియాలో లైకులు, షేర్లు కొట్టే జెన్ జీ యువత ఎండ తీవ్రత , క్షేత్రస్థాయి ఇబ్బందుల వల్ల ప్రత్యక్షంగా రోడ్లపైకి రావడానికి ఆసక్తి చూపించడం లేదు.
సి.జె.పి కేవలం ఒక వైరల్ మీమ్ ట్రెండ్‌గా మొదలైంది. దీనికి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్, వ్యవస్థాగత నిర్మాణం లేదు. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా విభాగానికి పనిచేయడం వల్ల, దీని వెనుక పొలిటికల్ ప్యాకేజింగ్ ఉందనే విమర్శలు కూడా దీని తీవ్రతను తగ్గించాయి.
నీట్ పరీక్షల అక్రమాలు, నిరుద్యోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈ ఉద్యమం ప్రారంభమైంది. అయితే సోషల్ మీడియా క్రేజ్ సుదీర్ఘ ప్రజా ఉద్యమంగా మారడం అంత సులువు కాదని ప్రస్తుత పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది.
