Sheikh Hasina
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. స్వదేశంలో తీవ్రరాజకీయ సంక్షోభం మధ్య భారత్ లో తలదాచుకుంటున్న ఆమె బంగ్లాదేశ్ కు తిరిగి వెళతానని ప్రకటించారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి దేశ బహిష్కరణలో ఉన్న షేక్ హసీనా(Sheikh Hasina)కు ప్రస్తుత ప్రభుత్వం మరణశిక్షను విధించింది.
ఏకపక్ష విచారణతో ఈ శిక్ష విధించారని ఆమె మద్దతుదారులు నిరసన తెలిపినా ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. స్వదేశంలో మరణశిక్ష విధించినా తాను స్వదేశానికి ఈ ఏడాదే వెళతానని షేక్ హసీనా చెప్పారు. తనపై కోర్టులు విధించిన మరణశిక్షపై హసీనా తీవ్ర స్థాయిలో స్పందించారు. తనపై ఇచ్చిన తీర్పులు చట్టబద్ధమైనవి కావన్నారు.
అవి పూర్తిగా రాజకీయ ప్రేరేపితం కాబడిన తీర్పులుగా అభివర్ణించారు. అవామీ లీగ్‌ను నాయకత్వ రహితంగా మార్చేందుకే ప్రస్తుత పాలకులు న్యాయవ్యవస్థను ఇష్టానుసారం వాడుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నోసార్లు తనపై గ్రెనేడ్ దాడులు జరిగాయనీ, తనకు చావంటే భయం లేదన్నారు.
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో కోటా సంస్కరణలకు వ్యతిరేకంగా చెలరేగిన విద్యార్థుల నిరసనలు, సైనిక తిరుగుబాటు తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసి ప్రాణరక్షణ కోసం భారత్‌కు పారిపోయి వచ్చారు. షేక్ హసీనా దేశం విడిచిన వెంటనే నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసంలోకి చొరబడి భారీ విధ్వంసం సృష్టించారు. ఆమె అక్కడ ఉండి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంది.
దీంతో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించింది. అయితే బంగ్లాదేశ్‌లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ఆమెపై పలు కేసులను విచారించి మరణశిక్ష విధించింది. షేక్ హసీనా హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చాలా బలంగా ఉండేవి. ఈశాన్య రాష్ట్రాల భద్రత, ఉగ్రవాద అణచివేత విషయంలో ఆమె భారత్‌కు ఎంతో సహకరించారు.
1975లో ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురైనప్పుడు కూడా అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం హసీనాకు దిల్లీలో రాజకీయ ఆశ్రయం కల్పించింది. ఆ పాత అనుబంధంతో భారత్ ఆమెకు ప్రస్తుత సంక్షోభంలోనూ అండగా నిలిచింది. ప్రస్తుతం షేక్ హసీనా(Sheikh Hasina) దిల్లీలోని ఒక సురక్షితమైన ప్రభుత్వ బంగళాలో గట్టి భద్రత మధ్య నివసిస్తున్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెను అప్పగించాలని కోరినా, అక్కడ ఆమెకు నిష్పాక్షికమైన విచారణ జరిగే అవకాశం లేదనే కారణంతో భారత్ ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
Mega 158 : మెగా 158 పల్లెటూరి కథే.. కానీ జెన్ జీ కి మాత్రం పూనకాలేనట..
