Kashi Vishwanath
హిందూ సనాతన ధర్మంలో అన్నిటి కంటే పవిత్రమైన, చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే అది కాశీ నగరం మాత్రమేనని పురాణాలు చెబుతాయి. గంగా నది ఒడ్డున వెలసిన కాశీ పుణ్యభూమి, సాక్షాత్తూ ఆ మహా శివుడి త్రిశూలం మీద నిలిచి ఉన్నట్లుగా భక్తులు నమ్ముతారు.
భారత దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ (Kashi Vishwanath) స్వామి కొలువై ఉన్న ఈ కాశీ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. ఆ మనిషి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోవడమే కాకుండా వారికి ముక్తి కూడా లభిస్తుందని పెద్దలు చెబుతారు.
కాశీ అంటే కేవలం గుడులు, గోపురాలే కాదు.. వందల ఏళ్లుగా భారతదేశపు వేద విద్యలకు, సంస్కృతి సంప్రదాయాలకు అది ఒక పెద్ద ఆధ్యాత్మిక నిలయంగా విరాజిల్లుతుంది.
కాశీ వెళ్లిన ప్రతి ఒక్కరూ గంగా నదిలో స్నానమాచరించడానికి ఎంతో ఆరాటపడతారు. అక్కడ ఉండే ఘాట్లలో ముఖ్యంగా దశాశ్వమేధ ఘాట్, మణికర్ణిక ఘాట్ లలో పుణ్యస్నానాలు చేసి ఆ తర్వాతే విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు.
ఇక ప్రతిరోజూ సాయంత్రం సమయంలో గంగా నది ఒడ్డున జరిగే గంగా హారతిని చూడటం నిజంగా కన్నుల పండువే అంటారు ఆ మహాకార్యాన్ని వీక్షించినవారు. వేద మంత్రాల హోరు, శంఖా నాదాలు , పెద్ద పెద్ద దీపాలతో ఇచ్చే ఆ గంగా హారతిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు.
ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కాశీ విశ్వనాథ్ (Kashi Vishwanath) కారిడార్ వల్ల భక్తులు గంగా నది నుంచి డైరెక్టుగా ఆలయానికి చేరుకునేలా దారి.. చాలా సులువుగా మారింది. దీంతో కాశీ క్షేత్రం మారిపోయి మరింత అందంగా కనిపిస్తోంది.
భక్తి పరంగా చూస్తే కాశీ క్షేత్రంలో ప్రతి అడుగూ ఒక ఆధ్యాత్మిక రహస్యమే . ఇక్కడ కేవలం విశ్వనాథుడే కాకుండా, అన్నపూర్ణా దేవి, కాలభైరవ స్వామి ఆలయాలు కూడా చాలా ఫేమస్. కాశీ వెళ్లిన వాళ్లు ఎవరైనా సరే ఆ ఊరి క్షేత్రపాలకుడైన కాలభైరవుడిని చూస్తేనే కాశీ యాత్ర పూర్తయినట్లు లెక్క అని స్థానికులు చెబుతారు.
ఎవరైనా తప్పులు చేస్తే వాళ్లకు శిక్ష వేసే అధికారం కాలభైరవుడికే ఉంటుందని.. దీనిని భైరవ యాతన అంటారని పురాణాలు చెబుతాయి. కాశీకి వెళ్లే భక్తులు తమ మనసులో ఉన్న చెడు ఆలోచనలను, పాపాలను వదిలేసి, కాలభైరవుడిని వేడుకుంటే ఆ భైరవుడు మనిషి పాపాలన్నిటినీ తుడిచేసి, విశ్వనాథుడి అనుగ్రహం లభించేలా చేస్తాడని నమ్మకం.
అందుకే కాశీ వెళ్లిన ప్రతీ ఒక్కరూ గంగా స్నానం చేసి, విశ్వనాథుడిని చూశాక.. తప్పకుండా కాలభైరవుడి దగ్గరకు వెళ్లి స్వామీ, మీ ఊరొచ్చాం మమ్మల్ని చల్లగా చూడు అంటూ మనసారా మొక్కుకుని, ఆయన నల్లటి రక్షా దారాన్ని చేతికి కట్టుకుని వస్తారు.
అంతేకాదు చివరి రోజుల్లో కాశీలో ప్రాణాలు విడిచే వాళ్లకు ఆ మహా శివుడే ..స్వయంగా చెవిలో తారక మంత్రాన్ని చెప్పి మోక్షాన్ని ఇస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకే తరతరాలుగా భక్తి వెలుగులను పంచుతున్న ఈ కాశీ మహా క్షేత్రం(Kashi Vishwanath ), హిందూ ధర్మానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
