IND vs PAK : పాక్‌ను తిప్పేసిన దీప్తి శర్మ..టీ20 వరల్డ్ కప్‌లో భారత్ బోణీ

IND vs PAK : మరోసారి పాక్ పై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న భారత మహిళల జట్టు వరల్డ్ కప్ లో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది

IND vs PAK

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ కు పాక్(IND vs PAK) పోటీఇవ్వలేకపోయింది. బ్యాటింగ్ లో స్మృతి మంధాన, రిచా ఘోష్ మెరిస్తే… బౌలింగ్ లో దీప్తి శర్మ, శ్రీచరణి తిప్పేశారు. దీంతో మరోసారి పాక్ పై తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్న భారత మహిళల జట్టు వరల్డ్ కప్ లో శుభారంభం చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. షెఫాలీ వర్మ (6), జమిమా (1) నిరాశ పరిచారు.దీంతో 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ తమ అనుభవంతో అద్భుతమైన పార్టనర్ షిప్ నెలకొల్పారు. మూడో వికెట్ కు 91 పరుగులు జోడించారు.

ఈ క్రమంలో పాక్ బౌలర్లను ఆటాడుకున్న స్మృతి కేవలం 44 బంతుల్లోనే 68 (9 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేయగా.. హర్మన్ ప్రీత్ 36 పరుగులకు ఔటైంది. చివర్లో రిచా ఘోష్ విధ్వంసం సృష్టించింది. భారీ షాట్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదేసింది.

ఒకదశలో 150 రన్స్ అయినా చేస్తుందనుకున్న భారత్ స్కోరును రిచా 170/6 కు చేర్చింది. రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేసి వెనుదిరిగింది. పాక్ బౌలర్లలో సదియా 2, ఫాతిమా సనా 2 వికెట్లు తీశారు.

తర్వాత 171 పరుగుల లక్ష్యఛేదనలో పాకిస్తాన్ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేసింది. ఓపెనర్ ఫిరోజా వికెట్ చేజార్చుకున్నా దాటిగా 52 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే పవర్ ప్లే తర్వాత భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు.

IND vs PAK

స్పిన్నర్లు పాక్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టారు. తమ స్పిన్ మ్యాజిక్ తో దెబ్బకొట్టారు. ఒకవైపు దీప్తి శర్మ, మరోవైపు తెలుగమ్మాయి శ్రీచరణి చెలరేగిపోవడంతో పాక్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. శ్రీచరణి 21 పరుగులకు 3 వికెట్లు తీయగా… ఆరంభంలో కీలక వికెట్లు తీసిన దీప్తి శర్మ చివర్లో టెయిలెండర్ల భరతం పట్టింది.

5 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించింది. 4 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చిన దీప్తి ఐదు వికెట్లు పడగొట్టింది. ఫలితంగా పాక్ 106 పరుగులకే కుప్పకూలింది. 64 పరుగులతో భారీ విజయాన్ని అందుకున్న భారత్(IND vs PAK) మహిళల జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.

Archery : ఆర్చరీలో భారత్ సరికొత్త చరిత్ర..కొరియాను ఓడించి స్వర్ణం కైవసం

Exit mobile version