Padmini Ekadashi
హిందూ సంప్రదాయంలో అతి పవిత్రమైన రోజుల్లో పద్మిని ఏకాదశి(Padmini Ekadashi) ఒకటి అని చాలామందికి తెలియదు. ఎందుకంటే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో మాత్రమే ఈ ఏకాదశి వస్తుంది. దీనిని అధిక మాస ఏకాదశి లేదా పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తుంటారు.
ఈ పవిత్రమైన రోజు లక్ష్మీనారాయణులను మనసారా భక్తి శ్రద్ధలతో పూజించి, ఉపవాసముంటే జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు.
ఈ ఏడాది పద్మిని ఏకాదశి(Padmini Ekadashi) ఎప్పుడు అనే విషయంలో చాలామందిలో చిన్న గందరగోళం నెలకొంది. పంచాంగం ప్రకారం మే 26వ తేదీ ఉదయం 7.49 నిమిషాలకే ఏకాదశి తిథి మొదలవుతున్నా, సూర్యోదయ తిథి నియమాలను బట్టి మే 27వ తేదీ బుధవారం రోజే పద్మిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు.
మే 27వ తేదీ ఉదయం 5.25 నిమిషాల నుంచి 8. 52 నిమిషాల వరకు పూజలు చేసుకోవడానికి అత్యంత శుభ సమయం. ఇక ఈ వ్రతం చేసేవారు మరుసటి రోజు అంటే మే 28వ తేదీ ఉదయం 5.25 నిమిషాల నుంచి 7.56 నిమిషాల లోపు ఉపవాసాన్ని విరమించాల్సి ఉంటుంది.
ఈ ఏకాదశి వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. పూర్వం కార్తవీర్యార్జునుడు అనే మహారాజు ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో ఆచరిస్తూ ఉండేవాడు.. అందుకే ఆ రాజు అపారమైన శక్తులను పొందాడట. ఆ బలంతోనే లంకేశ్వరుడైన రావణాసురుడిని కూడా యుద్ధంలో ఓడించి బంధించగలిగాడంటూ కథలు చెబుతున్నాయి.
అందుకే ప్రతీ ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి కుటుంబంలో సుఖసంతోషాలు, దాంపత్య అనుబంధం బలపడుతుందట. అంతే కాకుండా ఈ వ్రతం చేయడం వల్ల అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల బలమైన నమ్మకం.
ఆ రోజు ఉదయాన్నే లేచి తలంటుపోసుకుని.. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువుల పటాల ఎదుట దీపాన్ని వెలిగించి, పసుపు రంగు పూలు, తులసి దళాలతో పూజించాలి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని కానీ విష్ణు సహస్రనామాలను కానీ చదువుకోవడం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
వీలైనంత వరకు పద్మిని ఏకాదశి(Padmini Ekadashi) రోజు ఉపవాసం ఉండి, రాత్రి పూట జాగరణ చేయడం చాలా మంచిది. అలాగే తమకు తోచినంతగా పేదలకు అన్నదానం , వస్త్రదానం చేయడం వల్ల లక్ష్మీనారాయణుల కటాక్షం వారిపై ఎప్పుడూ ఉంటుంది.
నిజానికి సూర్య, చంద్రుల గమనాల మధ్య వచ్చే తేడాలను సరిచేయడానికే మన వేద పండితులు.. ప్రతి మూడేళ్లకు ఒకసారి పంచాంగంలో ఒక అదనపు నెలను చేరుస్తారు. దాన్నే అధిక మాసం అంటారు. ఈ పవిత్రమైన నెలలో వచ్చే ఈ ఏకాదశి రోజు.. భగవంతుడిని స్మరిస్తూ గడపడం వల్ల మనిషి జీవితంలో ఎంతో పురోగతి లభిస్తుందని పండితులు చెబుతారు.
Pawan Kalyan :సహనానికి హద్దులు దాటితే తాట తీస్తాం..పవన్ వార్నింగ్‌పై రాజకీయ విశ్లేషకుల అంచనా
