Enumeration Form : ఒక ఎన్యూమరేషన్ ఫామ్.. ఎన్నో ప్రశ్నలు.. గడువు తీరితే ఓటర్ పరిస్థితేంటి?

Enumeration Form : ఈసీ ఈ గడువును పొడిగించకపోతే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంది. సాంకేతిక లోపాలు, అవగాహన లేమివల్ల ఫామ్ ఫిల్ చేయలేకపోయిన అర్హులైన ఓటర్లు తమ ప్రాథమిక హక్కును కోల్పోయే అవకాశం ఉంది.

Enumeration Form

ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రాసెస్ ప్రస్తుతం సామాన్య ప్రజలకు ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది. ఆన్‌లైన్‌లో చేసుకోండి.. చాలా ఈజీ అంటూ అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో ఓటర్లు పడుతున్న తిప్పలకు అసలు పొంతనే లేదు.

అటు ఆన్‌లైన్‌లో సర్వర్ల మొరాయింపులు, ఇటు ఆఫ్‌లైన్‌లో పాతికేళ్ల నాటి అసాధ్యమైన కండీషన్లతో ఈ మొత్తం సవరణ ప్రక్రియ ఒక తీవ్రమైన గందరగోళంగా తయారైంది. చదువుకున్న వారు కూడా ఫామ్ పూర్తి చేయలేక తలలు పట్టుకుంటుంటే.. సామాన్య , గ్రామీణ ఓటర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది.

ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వెళ్లి ఫామ్ ఫిల్ చేద్దామంటే అడుగడుగునా టెక్నికల్ చిక్కులు వేధిస్తున్నాయి. స్టార్టింగ్‌లోనే క్యాప్చర్ సహనానికి పరీక్ష పెడుతుంటే.. తర్వాత ఒక కాలమ్ ఖాళీగా వదిలినా తర్వాతి పేజీకి వెళ్లే ప్రసక్తే లేకుండా సిస్టమ్‌  లాక్.. పరేశాన్ చేసేస్తుంది. దీనికి తోడు ప్రతి 2 నిమిషాలకు సర్వర్ డౌన్ అవ్వడం, డేటా మిస్‌మ్యాచ్ కావడం, ఓటీపీలు సకాలంలో రాకపోవడంతో సగం దూరం వెళ్లాక అప్లికేషన్ ఆగిపోతోంది.

అసలు సంబంధం లేని 2002 నాటి నియోజకవర్గం, జిల్లా, అప్పటి ఓటు వివరాలు కావాలంటూ పెట్టే కొర్రీలు ఓటర్స్ సహనానికి టెస్ట్ పెడుతున్నాయి. ఇరవై ఏళ్లలో నియోజకవర్గాలు మారిపోయాయి, కొత్త జిల్లాలు వచ్చాయి, రాష్ట్రాలే విడిపోయాయి. ఇలాంటి స్థితిలో రెండు దశాబ్దాల క్రితం నాటి పాత డేటాను సామాన్యులు ఎక్కడి నుంచి తేవాలని పాలకులను, అధికారులను నిలదీస్తున్నారు.

ఇలాంటి ఘోరమైన పరిస్థితుల మధ్య సవరణకు డెడ్ లైన్ ముంచుకొస్తుండటం ఓటర్లలో గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒకవేళ ఈసీ ఈ గడువును పొడిగించకపోతే పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంది. సాంకేతిక లోపాలు, అవగాహన లేమివల్ల ఫామ్ ఫిల్ చేయలేకపోయిన అర్హులైన ఓటర్లు తమ ప్రాథమిక హక్కును కోల్పోయే అవకాశం ఉంది. డెడ్ లైన్ ముగిసిపోతే, వివరాలు సమర్పించలేదనే నెపంతో లక్షలాది ఓట్లను అధికారులు తొలగించే ప్రమాదం కూడా పొంచి ఉంది.

Enumeration Form

ప్రస్తుతం ఓటర్ల మనస్సులో ఎన్నో ప్రశ్నలు, భయాలు రేగుతున్నాయి. 2002 నాటి వివరాలు లేదా తల్లిదండ్రుల పాత సమాచారం లేనప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి? పొరపాటున ఏదైనా కాలమ్ తప్పుగా నింపితే ఓటు తీసేస్తారా? ఆన్‌లైన్‌లో మధ్యలో ఆగిపోయిన ఫామ్‌లను ఎలా రికవర్ చేయాలనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) కూడా యాప్‌లు పనిచేయక, ఇంటర్నెట్ సరిగ్గా లేక, పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్‌లు(Enumeration Form) కలెక్ట్ చేసిన వాటికి పొంతన కుదరక చేతులెత్తేస్తున్నారు.

ఈ ఘోరమైన గందరగోళానికి తెరపడాలంటే ఎన్నికల సంఘం (EC) వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి ఇబ్బందులను గమనించాలి. ఆన్‌లైన్ పోర్టల్‌ లోపాలను వెంటనే సరిచేయాలి. అలాగే 2002 వివరాల నిబంధనపై మినహాయింపులు ఇస్తూ, సవరణ గడువును పొడిగించాల్సిన అవసరం కూడా ఉంది.

Linen : అయ్యగారి కంబ్యాక్ అదిరింది.. మూడు రోజుల్లోనే అఖిల్ లెనిన్ కలెక్షన్ల సునామీ

Exit mobile version