Garuda Purana
మనిషి జీవితంలో తప్పని సరిగా జరిగేది..అలాగే అత్యంత నిగూఢమైనది కూడా మరణమే. జన్మించిన ప్రతి ప్రాణి ఏదొక రోజున తనువు చాలించక తప్పదనేది ప్రకృతి సిద్ధాంతం. అయితే, సహజంగా వృద్ధాప్యం వల్ల కలిగే మరణం ఒక ఎత్తైతే, ఎవరూ అనుకోని విధంగా సంభవించే అకాల మరణం మరొక ఎత్తు అవుతుంది.
అసలు అకాల మరణం అంటే ఏమిటి? మనిషికి కేటాయించిన నూరేళ్ల ఆయుష్షు తీరకుండానే, ప్రమాదం వల్లో లేదా ఆత్మహత్యల వల్లో కన్నుమూస్తే ఆ ఆత్మ ఏమవుతుందనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంది. అయితే ఇలాంటి ఎన్నో భీతి గొలిపే ప్రశ్నలకు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే.. గరుత్మంతుడికి వివరించిన గరుడ పురాణం(Garuda Purana)లో అద్భుతమైన సమాధానాలు దొరుకుతాయి.
సాధారణంగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ ఆత్మ యమధర్మరాజు ఆజ్ఞతో తన పరలోక ప్రయాణాన్ని ప్రారంభిస్తుందట. అయితే, అకాల మరణం పొందిన వారి విషయంలో మాత్రం ఈ ప్రయాణం అంత సులభంగా జరగదట. ఎందుకంటే, ఆ వ్యక్తికి ఇంకా ఈ భూమిపై ఉండాల్సిన కాలం మిగిలే ఉంటుంది కాబట్టి.
మనిషి శరీరానికి మరణం కలిగినా, ఆత్మకు మాత్రం ఉండాల్సిన ప్రాపంచిక బంధాలు, ఆశలు , తీరని కోరికలు అలాగే ఉండిపోతాయి. దీని వల్లే అకాల మరణం చెందిన ఆత్మలు వెంటనే అటు యమలోకానికి వెళ్లలేక, ఇటు భూలోకానికీ , పరలోకానికీ మధ్య ఉండే ప్రేత లోకంలో చిక్కుకుపోతాయని గరుడ పురాణంలో ఉంది.
అయితే ఈ ప్రేత స్థితిలో ఉన్న ఆత్మలకు మనిషిలాగా ఆకలి దప్పికలు ఉంటాయట. కానీ వాటిని తీర్చుకోవడానికి భౌతికమైన శరీరం ఉండదు. ఫలితంగా అవి తీవ్రమైన అసహనానికి లోనవుతాయి. తమకు కేటాయించిన సహజ ఆయుష్షు పూర్తిగా ముగిసే వరకు కూడా ఆ ఆత్మలు గాలి రూపంలో తాము నివసించిన ప్రదేశాల చుట్టూ, తమ ఆత్మీయుల చుట్టూ తిరుగుతూనే ఉంటాయని శాస్త్రం వివరిస్తోంది.
అయితే ఇది నిజంగా ఆ ఆత్మకు ఒక రకమైన శిక్ష వంటిదే. అందుకే ఇలాంటి ఆత్మలకు విముక్తి కలిగించడమనేది కుటుంబ సభ్యుల బాధ్యతని గరుడ పురాణం(Garuda Purana) నొక్కి చెబుతోంది. అకాల మరణం పొందిన వారికి కేవలం సాధారణ ఉత్తర క్రియలు చేసేస్తే సరిపోదట. వారి కోసం నారాయణ బలి వంటి ప్రత్యేకమైన పూజలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఈ పూజ ఆ ఆత్మకు ఉన్న ప్రేత తత్వాన్ని తొలగించడంతో పాటు, పితృ దేవతల వరుసలో చేరేలా చేస్తుందట. అలాగే గయ , కాశీ వంటి పవిత్ర తీర్థ క్షేత్రాలలో పిండప్రదానాలను చేయడం, ఆ వ్యక్తి మరణించిన పది రోజుల పాటు ప్రతీరోజూ ఇంట్లో గరుడ పురాణాన్ని(Garuda Purana) పఠించడం వల్ల ఆ ఆత్మకు శాంతి కలుగుతుందట.
అలాగే అలా అకాల మరణం పొంది వ్యక్తి పేరు మీద చేసే అన్నదానం, వస్త్రదానం ..ఆ ఆత్మ ప్రయాణ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందట. ఇక చివరగా చెప్పేదేంటి అంటి.. జీవితంలో ఫలితం ఆశించకుండా నిత్యం సత్కర్మలు చేసే వ్యక్తులకు మాత్రం మరణం ఎప్పుడు సంభవించినా సరే వారు నేరుగా విష్ణులోకాన్ని పొందుతారని ఈ పవిత్ర గ్రంథం చెబుతోంది.
