Team India : టీమిండియాకు జాక్ పాట్.. బీసీసీఐ రూ.131 కోట్ల నజరానా

Team India : టీ ట్వంటీ ప్రపంచకప్ ను వరుసగా రెండోసారి గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది

Team India

టీ ట్వంటీ ప్రపంచకప్ ను వరుసగా రెండోసారి గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత(Team India) జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ నజరానా ప్రకటించింది. ఈ విజయానికి రివార్డుగా టీమిండియాకు రూ.131 కోట్ల రూపాయలను క్యాష్ ప్రైజ్ గా అందించబోతున్నట్టు బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా ప్రకటించారు. అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టును అభినందిస్తూ ఈ నజరానా ప్రకటించినట్టు తెలిపారు.

2024లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు ఇచ్చిన నజరానా కంటే ఇది రూ.6 కోట్లు ఎక్కువ. అప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి ట్రోఫీ గెలుచుకోగా బీసీసీఐ రూ.125 కోట్లు నజరానాగా అందజేసింది. ఇప్పుడు మరో ఆరు కోట్లు ఎక్కువగానే క్యాష్ రివార్డ్ ప్రకటించింది. అప్పుడు జట్టులోని ప్రతీ ఆటగాడికీ రూ.5 కోట్ల చొప్పున, రిజర్వ్ ప్లేయర్స్ కు కోటి రూపాయల చొప్పున లభించాయి.

ఇప్పుడు రూ.131 కోట్ల భారీ నజారానాలో ఎవరికి ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. అయితే జట్టులోని 15 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికీ రూ.5 నుంచి 6 కోట్ల వరకూ దక్కనుంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ , బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ లకు కూడా ప్లేయర్స్ తో సమానంగా రివార్డు అందనుంది. సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్న ఫిజియోలు, ట్రైనర్లు, మసాజర్లు, వీడియో ఎనలిస్ట్, ఇతర స్టాఫ్ కు వారి హోదాను బట్టి రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్ల వరకు క్యాష్ ప్రైజ్ లభించే అవకాశముంది.

Team India

వీరితో పాటు జట్టును ఎంపిక చేసిన సెలెక్షన్ కమిటీ సభ్యులకు కూడా కోటి చొప్పున నగదు పురస్కారం దక్కనుంది. అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో ఆదివారం వేదికగా జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 255 పరుగుల భారీస్కోరు చేయగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలతో రాణించారు.

తర్వాత ఛేజింగ్ లో న్యూజిలాండ్ ను భారత(Team India) బౌలర్లు 159 పరుగులకే ఆలౌట్ చేశారు. బుమ్రా 4 , అక్షర్ పటేల్ 3 వికెట్లతో కివీస్ ను దెబ్బకొట్టారు. ఫలితంగా వరుసగా రెండోసారి , ఓవరాల్ గా మూడోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. కాగా త్వరలోనే బీసీసీఐ భారత జట్టుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ నజరానా అందజేయనుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version