Mumbai Indians
ఐపీఎల్ 19వ సీజన్ లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తోన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians )ఇప్పుడు డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. చెపాక్ స్టేడియం వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది. గత సీజన్ తరహాలోనే ఈ సారి కూడా ముంబై స్థాయికి తగినట్టు ఆడలేకపోతోంది. కీలక ఆటగాళ్ళంతా ఘోరంగా విఫలమవుతున్నారు. వరుస పరాజయాలతో ప్రస్తుతం ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది.
ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లలో కేవలం రెండే విజయాలు సాధించిన ముంబై(Mumbai Indians) ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్ లో ఓడినా ప్లే ఆఫ్ ఆశలు గల్లంతవుతాయి. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ పై భారీస్కోరు చేసినా పరాజయం పాలైంది. బూమ్రాతో సహా బౌలర్లందరూ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో 243 పరుగుల స్కోరును కూడా కాపాడుకోలేకపోయింది.
దీంతో బౌలర్లు గాడిన పడితే తప్ప ముంబైకి విజయం దక్కే అవకాశాలు లేవు. అటు బ్యాటింగ్ లో రికెల్టన్ సెంచరీతో ఫామ్ లోకి రాగా.. మిగిలిన వారిలో సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా నిరాశ పరుస్తున్నారు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఆడడం కూాడా అనుమానంగానే కనిపిస్తోంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ముంబై కంటే కాస్త మెరుగైన స్థితిలో ఉంది. ఆరంభంలో వరుస పరాజయాలతో సతమతమైన చెన్నై తర్వాత పుంజుకుంది. 8 మ్యాచ్ లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ పై గెలిచిన తర్వాత సన్ రైజర్స్ చేతిలో ఓడిన చెన్నై ముంబై ఇండియన్స్ ను ఓడించింది.
అయితే గత మ్యాచ్ లో గుజరాత్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ముంబైపై గెలిచి మళ్లీ గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. బ్యాటింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి రావడం సీఎస్కేకు అడ్వాంటేజ్. సంజూ శాంసన్, బ్రెవిస్, శివమ్ దూబే కూడా చెలరేగితే భారీస్కోరు సాధించే అవకాశముంటుంది. అటు బౌలింగ్ లో ఓవర్టన్ నిలకడగా రాణిస్తున్నాడు. అన్షుల్ కాంబోజ్ , ముకేశ్ చౌదరి ఇంకా లైన్ అండ్ లెంగ్త్ అందుకోలేదు.
స్పిన్ విభాగంలో అకిల్ హొస్సేన్ తో పాటు నూర్ అహ్మద్ ఆకట్టుకుంటున్నారు. గత రికార్డుల పరంగా చూస్తే ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 42 మ్యాచ్ లలో తలపడితే ముంబై 22 సార్లు గెలిచింది. చెన్నై 20 మ్యాచ్ లలో విజయం సాధించింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న చెన్నై పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా.
Delhi Capitals : రాహుల్, నిస్సాంక ధనాధన్..రాజస్థాన్ కు ఢిల్లీ షాక్
