IND vs ENG : భారత్‌కు ఇంగ్లీష్ సవాల్.. నేడు ఇంగ్లాండ్‌తో తొలి టీ20

IND vs ENG : భారత బ్యాటర్లకు ఈ సిరీస్ అగ్ని పరీక్ష కానుంది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి ఇది కీలకమైన సిరీస్‌గా చెప్పొచ్చు.

IND vs ENG

భారత్, ఇంగ్లాండ్ ఐదు టీ ట్వంటీల సిరీస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ పరాభవానికి గురైన వరల్డ్ ఛాంపియన్ టీమిండియా మూడు రోజుల వ్యవధిలోనే ఇంగ్లాండ్‌(IND vs ENG)తో టీ20 సిరీస్ ఆడబోతోంది.

ఇంగ్లీష్ కండీషన్స్‌కు తగ్గట్టుగా ఆడటానికి పూర్తిస్థాయి ప్రిపరేషన్ లేకుండానే తొలి మ్యాచ్‌కు రెడీ అయిపోయింది. ఒకరోజు మాత్రమే ప్రాక్టీస్ చేసిన భారత క్రికెటర్లు ..ఇంగ్లీష్ పిచ్‌లపై నిలబడతారా అనేది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే ఐర్లాండ్ పిచ్‌లపై చేతులెత్తేసిన భారత బ్యాటర్లకు ఈ సిరీస్ అగ్ని పరీక్ష కానుంది. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి ఇది కీలకమైన సిరీస్‌గా చెప్పొచ్చు. అటు గంభీర్ వ్యూహాలకు కూడా ఈ సిరీస్ పరీక్ష పెట్టబోతోంది. టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ ఛాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడలేక ఐర్లాండ్ చేతిలో క్లీన్ స్వీప్ పరాజయం పాలవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

అటు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఈ సిరీస్‌లో శుభారంభం చేయక తప్పదు. ఐర్లాండ్‌పై ఘోర పరాజయం పాలైనా సరే.. భారత తుది జట్టులో మార్పులు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

నిజానికి వైభవ్ విషయంలో తొందరపడడం లేదని టీమిండియా మేనేజ్మెంట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. తాజాగా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. టీ20 ప్రపంచకప్ గెలిపించిన ఓపెనింగ్ జోడీని మార్చే పరిస్థితి లేదన్నాడు. సీనియర్లకు అండగా ఉంటామంటూ వ్యాఖ్యానించడంతో వైభవ్‌కు నిరాశే మిగలనుంది.

బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ కీలకం కానున్నారు. వీరంతా సమిష్టిగా రాణిస్తే తప్ప విజయంపై ఆశలు పెట్టుకోలేం. అలాగే ఫినిషర్ రోల్‌లో శివమ్ దూబేపై అంచనాలున్నాయి. ఇంగ్లీష్ పిచ్‌లపై వీరంతా ఎలా రాణిస్తారనేది చూడాలి.

అటు బౌలింగ్‌లో పేస్ అటాక్‌కు సంబంధించి అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ కీలకం కానున్నారు. స్పిన్ విభాగంలో రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గానూ, ఆల్ రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ ఆడబోతున్నారు.

IND vs ENG

మరోవైపు కివీస్ చేతిలో టెస్ట్ సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లాండ్ టీ20 ఫార్మాట్‌కు మరో జట్టుతో ఆడబోతోంది. సాల్ట్ , బట్లర్, విల్ జాక్స్ వంటి ప్లేయర్స్ ఇటీవల ఐపీఎల్‌లో రాణించిన వారే.

అటు బౌలింగ్‌లో ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్‌పై బాగానే అంచనాలున్నాయి. గత రికార్డుల్లో భారత్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్లు 30 మ్యాచ్‌లలో తలపడితే భారత్ 18 సార్లు, ఇంగ్లాండ్ 12 సార్లు గెలిచాయి. ఇక చెస్టర్-లె-స్ట్రీట్‌ పిచ్ బ్యాలెన్సింగ్‌గా ఉండటంతో.. మొదట్లో సీమర్లకు, క్రమంగా బ్యాటర్లకు అనుకూలిస్తుంది.

Ketan Agarwal : కేతన్‌ను సియా ఎక్కడి నుంచి తోసేసిందో చూడాలి..లోహగడ్ కోటకు క్యూ కడుతున్న టూరిస్టులు

Exit mobile version