IND vs ENG : సిరీస్ పట్టేస్తారా ?..ఈరోజే ఇంగ్లాండ్‌తో భారత్ రెండో వన్డే

IND vs ENG : సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

IND vs ENG

టీ20 సిరీస్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఉన్న భారత్ తొలి వన్డేలో అదరగొట్టి ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సిరీస్ విజయమే లక్ష్యంగా రెండో వన్డేకు సిద్ధమైంది. గురువారం కార్డిఫ్ వేదికగా ఇంగ్లాండ్‌(IND vs ENG)తో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.

అటు సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. తొలి వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా యువ ఆటగాళ్లను పరీక్షిస్తూనే, గెలుపు కాంబినేషన్‌ను కొనసాగించడంపై టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది.

తొలి వన్డేలో 80 పరుగులు చేసి ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అయితే ప్రస్తుతం అతను పూర్తిగా కోలుకున్నాడని, రెండో వన్డేకు అందుబాటులో ఉంటాడని జట్టు వర్గాలు తెలిపాయి. దీంతో రోహిత్ శర్మతో కలిసి గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. కాగా తొలి మ్యాచ్‌లో విఫలమైన రోహిత్, తన సహజసిద్ధమైన దూకుడు ఆటను ఆడేలా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది.

అటు విరాట్ కోహ్లీ కూడా ఫామ్ అందుకోవాల్సి ఉంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు జరిగే ప్రతీ మ్యాచ్‌లోనూ రోహిత్ , కోహ్లీ కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. లేకపోతే జట్టులో చోటు దక్కడం కష్టమేనని చెప్పొచ్చు. దీంతో రెండో వన్డేలో రోకో జోడీ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడటంపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

కాగా తొలి మ్యాచ్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ త్వరగానే అవుట్ అయినా.. శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ మిడిలార్డర్‌ను నిలబెట్టారు. రెండో వన్డేలోనూ ఇదే బ్యాటింగ్ లైనప్‌ను కొనసాగించే అవకాశం ఉంది. తొలి వన్డే విజయంలో అక్షర్ పటేల్ (4 వికెట్లు, 57 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (52) అజేయమైన 100 పరుగుల భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది.

వీరిద్దరూ బ్యాటింగ్ డెప్త్‌ను పెంచడంతో ఇంగ్లండ్(IND vs ENG) బ్యాటర్లను స్పిన్‌తో కట్టడి చేయగలరు. కార్డిఫ్‌లో స్పిన్ ప్రభావం పెద్దగా ఉండకపోయినా వీరి ఆల్‌రౌండ్ నైపుణ్యంతో కుల్దీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌లోనూ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. కాగా కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ పిచ్ ప్రారంభంలో పేసర్లకు, స్వింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. దీని ప్రకారం భారత బౌలింగ్ విభాగంలో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది.

IND vs ENG

తొలి వన్డేలో ఎక్కువ పరుగులు ఇచ్చిన యువ పేసర్ గుర్నూర్ బ్రార్ స్థానంలో, లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ స్పెషలిస్ట్ అర్షదీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణలతో కలిసి అర్షదీప్ పవర్‌ప్లేలో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను కట్టడి చేస్తే భారత్ పైచేయి సాధించే అవకాశముంటుంది. మరోవైపు తొలి వన్డేలో తప్పిదాలను పురవావృతం చేయకుండా సమిష్టిగా రాణించి సిరీస్ సమం చేయాలని ఇంగ్లాండ్ జట్టు ఎదురుచూస్తోంది.

Swiggy Instamart : ఇకపై నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. నయా సేవలను మొదలుపెట్టిన స్విగ్గీ

Exit mobile version