IND vs ENG
ఐర్లాండ్ చేతిలో సిరీస్ ఓటమి.. ఇంగ్లాండ్ చేతిలో రెండో టీ20లోనూ పరాజయం.. వెరసి తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత్ మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. తుది జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ ఇవ్వనుండగా సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే మిగలనుంది. అటు ఇంగ్లాండ్ మాత్రం అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. భారత్, ఇంగ్లాండ్(IND vs ENG) మధ్య మరో రసవత్తర సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది.
మంగళవారం నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా మూడో టీ20 జరగబోతోంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దవగా, రెండో టీ20లో ఇంగ్లాండ్ గెలిచింది. ఇప్పుడు సిరీస్ చేజారకుండా ఉండాలంటే ట్రెంట్ బ్రిడ్జిలో భారత్ దుమ్మురేపాల్సిందే. ఇప్పటికే ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలో ఉండగా ఇది కూడా ఓడితే సిరీస్ గెలిచే అవకాశం భారత్‌కు ఉండదు.
తర్వాత మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిచినా సిరీస్ సమం అవుతుంది. గత మ్యాచ్‌కు భారత్ ఓటమికి కారణం బౌలర్ల వైఫల్యమే. ఆరంభంలో అదరగొట్టిన భారత బౌలర్లు తర్వాత చేతులెత్తేశారు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో తడబడ్డారు. రవి బిష్ణోయ్ ఒక ఓవర్లో 29 పరుగులు ఇవ్వడం ఓటమికి కారణమైంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టుకు సంబంధించి ఒక మార్పు చోటు చేసుకోనుంది.
రవి బిష్ణోయ్ స్థానంలో ప్రిన్స్ యాదవ్ జట్టులోకి రానున్నాడు. యార్కర్ల స్పెషలిస్టుగా గుర్తింపున్న ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్‌లో కీలకం కానున్నాడు. మిగిలిన జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీని కొనసాగించనుండడంతో సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.
భారత బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ , ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉన్నారు. శివమ్ దూబే ఫినిషర్ రోల్‌కు ఇంకా న్యాయం చేయాల్సి ఉంది. ఇటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా పెద్ద ఇన్నింగ్సే బాకీ ఉన్నాడు. అటు బౌలింగ్‌లో అర్షదీప్ , హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ పేస్ ఎటాక్‌లో ఉండగా.. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిపై అంచనాలున్నాయి.
మరోవైపు ఇంగ్లాండ్(IND vs ENG) మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. రెండో టీ20 ఆడిన ఫైనల్ ఎలెవన్‌తోనే బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.
Sanju : సంజూ ఔట్.. ప్రభ్ సిమ్రన్ ఇన్..జింబాబ్వే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన
