T20 World Cup
టీ20 ప్రపంచకప్ లో తడబడుతూ సాగుతున్న టీమిండియా అసలు సిసలు మ్యాచ్ లో మాత్రం దుమ్మురేపింది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమిస్తూ ఇంగ్లాండ్ పై సెమీఫైనల్లో రెచ్చిపోయింది. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయారు. ఫలితంగా 250 ప్లస్ స్కోరు నమోదు చేసే క్రమంలో పలు రికార్డులు కొల్లగొట్టింది. టాస్ ఓడిపోవడమే మంచిదైందన్న రీతిలో మన బ్యాటింగ్ కొనసాగింది.
అభిషేక్ శర్మ త్వరగానే ఔటైనా.. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వాంఖడేలో విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా సంజూ శాంసన్ తన ఫామ్ కంటిన్యూ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అటు ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీస్కోరు చేసింది.
టీ20 ప్రపంచకప్(T20 World Cup) చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. అలాగే టీ20ల్లో250కి పైగా స్కోరు చేయడం భారత్ కు ఇది ఆరోసారి. టీమిండియా తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 5 సార్లు, వెస్టిండీస్, జింబాబ్వే, సర్రే మూడుసార్లు 250 ప్లస్ స్కోర్లు సాధించాయి.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో భారత్ మొత్తం 19 సిక్సర్లు బాదింది. తద్వారా 2014లో నెదర్లాండ్స్, ఐర్లాండ్ మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ లో నమోదైన అత్యధిక సిక్సర్ల రికార్డును సమం చేసింది. ఈ ప్రపంచకప్ లో విండీస్, జింబాబ్వే మ్యాచ్ లోనూ 19 సిక్సర్లు నమోదయ్యాయి. అలాగే భారత్, జింబాబ్వే మ్యాచ్ లో 17 సిక్సర్లు నమోదయ్యాయి.
ఇక విండీస్ తో మ్యాచ్ నుంచీ ఫామ్ లోకి వచ్చిన సంజూ శాంసన్ ఈ టీ20 ప్రపంచకప్(T20 World Cup) లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో 2024 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ 15 సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ సంజూ 16 సిక్సర్లు కొట్టాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై ఏకంగా 7 సిక్సర్లు బాదాడు. ఇక ఈ మ్యాచ్ లో బౌండరీలు, సిక్సర్లు కలిపి 37 వచ్చాయి. టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఇది రెండో అత్యధికం.
