IND vs PAK
ప్రపంచ క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ ఎప్పుడు తలపడినా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల పురుషుల, మహిళల టీ20 ప్రపంచకప్‌లలో రెండు జట్లు తలపడ్డాయి. ఎప్పటిలానే భారత్‌దే పైచేయిగా నిలిచింది. తాజాగా మరోసారి చిరకాల ప్రత్యర్థుల సమరం అభిమానులను అలరించబోతోంది.
మహిళల ఆసియాకప్ వేదికగా భారత్, పాక్(IND vs PAK) తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 5న దాయాదుల క్రికెట్ సమరం జరగబోతోంది. తాజాగా మహిళల ఆసియాకప్ షెడ్యూల్‌ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఊహించినట్టుగానే యూఏఈ ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తోంది.
ఈ టోర్నీలో భారత్ , పాకిస్థాన్(IND vs PAK) జట్లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. గ్రూప్ ఎ లో భారత్, పాక్ తో పాటు థాయ్‌లాండ్, హాంకాంగ్ చైనా జట్లు ఉండగా, గ్రూప్ బి లో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియా చోటు దక్కించుకున్నాయి. రౌండ్ రాబినా ఫార్మాట్‌లో టోర్నీ జరుగుతుంది. ఆగస్టు 28న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో థాయ్‌లాండ్, హాంకాంగ్ చైనా జట్లు తలపడతాయి.
భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆగస్టు 30న థాయ్‌లాండ్‌ను ఢీకొంటుంది. సెప్టెంబర్ 3న హాంకాంగ్ చైనాతోనూ, సెప్టెంబర్ 5న పాకిస్థాన్ తోనూ తలపడుతుంది. సెప్టెంబర్ 10న తొలి సెమీఫైనల్, సెప్టెంబర్ 11న రెండో సెమీఫైనల్ జరగనుండగా, సెప్టెంబర్ 13న ఫైనల్ జరుగుతుంది.
అన్ని మ్యాచ్‌లకూ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మహిళల ఆసియాకప్‌లో భారత్‌కు అద్భుతమైన రికార్డుంది. ఇప్పటి వరకూ ఏడుసార్లు టైటిల్ గెలిచిన భారత్ ఎనిమిదో టైటిల్‌పై కన్నేసింది.
అలాగే పాక్‌పైనా తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. ఒక్కసారి కూడా ఆసియాకప్‌లో భారత్ పాక్‌పై ఓడిపోలేదు. కాగా ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరలేకపోయినా భారత్ ఆసియాకప్‌లో సత్తా చాటాలని ఎదురుచూస్తోంది.
శ్రీలంక మహిళల జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 2024 ఎడిషన్‌లో లంక భారత జట్టుపై గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. మహిళల ఆసియాకప్ 2004లో ప్రారంభమైంది. టీ20 ఫార్మాట్ లో జరగబోయే ఆసియాకప్ 6వ ఎడిషన్ ఇది.
Megastar Chiranjeevi : ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. మెగాస్టార్ టీమ్ రియాక్షన్
