Khairatabad Ganesh
ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి ఉత్సవాలు పేరు చెప్పగానే ఖైరతాబాద్ మహాగణపతి(Khairatabad Ganesh) మీదే అందరి దృష్టి పడుతుంది. ఎనిమిదో రోజుకు చేరుకున్న ఈ నవరాత్రి వేడుకల్లో గణపయ్యను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. గణనాథుడిని కళ్లారా చూసి తరించడానికి భక్తులకు ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో క్యూ లైన్లు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి.
ఒకవైపు భక్తి పారవశ్యంతో, మరోవైపు నిమజ్జనం ఆంక్షలపై ఆందోళన మొదలవుతోంది. దీంతో ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉత్కంఠకు వేదికగా మారాయి.
ఈ ఏడాది ఏకంగా 69 అడుగుల భారీ ఎత్తుతో, పంచముఖ సంకటహర మహా గణపతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న ఖైరతాబాద్ గణేషుడి వద్ద రద్దీని అధికారులు కూడా అంచనా వేయలేని విధంగా సాగుతోంది. సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగి.. దాదాపు రెండు కిలోమీటర్ల వరకూ క్యూ లైన్లు సాగాయి.
లంబోదరుడి దర్శనానికి దాదాపు 4 గంటల సుదీర్ఘ సమయం పట్టింది. దీంతో తీవ్రమైన రద్దీ వల్ల వయోవృద్ధులు, చిన్నపిల్లలను తీసుకుని రాకూడదని ఉత్సవ నిర్వాహకులు, పోలీసులు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. 12 వ రోజు ఈ నెల 25న బడా గణేషుడి నిమజ్జన ఘట్టం జరగనుండటంతో.. ఆ భారీ ఏర్పాట్ల కోసం 24న ప్రాసెస్ ప్రారంభిస్తారు. దీంతో భక్తుల దర్శనాలను ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకే నిలిపివేయబోతున్నారు.
గణేషుడి నిమజ్జన సమయంలో అలాగే దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఇబ్బంది రాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా 600 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు కొనసాగుతోంది. 25న హుస్సేన్ సాగర్ పరిధిలోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఈ మహా గణనాధుని నిమజ్జనం జరగనుంది.
మరోవైపు నిమజ్జనం విషయంలో ప్రస్తుతం హైదరాబాద్‌లో పెద్ద రగడే నడుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ట్యాంక్ బండ్ పైన విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆంక్షలు విధిస్తూ.. అక్కడ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీనిపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సెప్టెంబర్ 19న ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్న ఉత్సవ సమితి సభ్యులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మొత్తానికి ఓ వైపు ఖైరతాబాద్ మహాగణనాధుడి(Khairatabad Ganesh) దర్శనాల కోసం భక్తులు పోటెత్తుతుంటే, మరోవైపు మాత్రం ట్యాంక్ బండ్ నిమజ్జనంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. మరి ఆరోజు ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతాయో అని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు దర్శనానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉండటంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
Love And Attachment : ప్రేమ నిజంగా ప్రేమేనా..లేక కోల్పోతామనే భయమా? ఓషో చెప్పిన సత్యం..
