IND vs SL : భారత్‌కు వార్మప్ పరీక్ష.. లంక ఎలెవన్‌తో సన్నాహక మ్యాచ్

IND vs SL : కొంతకాలంగా స్పిన్‌ను ఆడడంలో భారత కీలక బ్యాటర్లందరూ ఇబ్బంది పడుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో పరాభవాలకు ఇదే కారణం.

IND vs SL

శ్రీలంక పర్యటనలో టెస్ట్ సిరీస్‌కు ముందు తొలి పరీక్షకు భారత్ సిద్ధమైంది. లంక ఎలెవన్‌తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ శుక్రవారం నుంచే మొదలుకాబోతోంది. రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత బ్యాటర్లకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. లంక స్పిన్ పరీక్షను సమర్థంగా ఎదుర్కోవడానికి ఈ మ్యాచ్ కీలకం కాబోతోంది.

కొంతకాలంగా స్పిన్‌ను ఆడడంలో భారత కీలక బ్యాటర్లందరూ ఇబ్బంది పడుతున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో పరాభవాలకు ఇదే కారణం. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీలంకతో సిరీస్ భారత్‌కు అగ్నిపరీక్షగా మారింది. లంక జట్టులో సమర్థవంతమైన స్పిన్నర్లు మన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం భారత్‌తో వార్మప్ మ్యాచ్ కోసం ప్రకటించిన లంక(IND vs SL) ఎలెవెన్‌లోనూ క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. దీంతో వార్మప్ మ్యాచ్ కూడా భారత్‌కు అంత ఈజీగా ఉండదని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీలంకకు బయలుదేరే ముందు వారం రోజులు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ స్పిన్ బౌలింగ్‌లోనే ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు. పైగా భారత జట్టు కోసం బీసీసీఐ కూడా నెట్ బౌలర్లుగా నలుగురు భిన్నమైన స్పిన్నర్లను ఎంపిక చేసి పంపించింది.

ఈ పరిణామాలను చూస్తే లంక స్పిన్ ఛాలెంజ్‌ను భారత్ ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థమవుతోంది. ప్రస్తుతం లంకపై బరిలోకి దిగబోతున్న భారత టెస్ట్ జట్టులో రాహుల్, కుల్దీప్, జడేజాలకు మాత్రమే అక్కడ టెస్టులు ఆడిన అనుభవం ఉంది. మిగిలిన వారిలో ఎక్కువమంది తొలిసారి అక్కడ రెడ్ బాల్ క్రికెట్ ఆడబోతున్నారు.

శ్రీలంకలో భారత్ చివరిసారిగా 2017లో పర్యటించింది. అప్పుడు మూడు టెస్టుల సిరీస్‌ను వైట్ వాష్ చేసింది. అప్పటి జట్టులో రహానే, పుజారా, అభినవ్ ముకుంద్ వంటి టెస్ట్ స్పెషలిస్టులు, కోహ్లీ కెప్టెన్సీ కీలకంగా మారాయి. ప్రస్తుత జట్టులో చాలా మంది బ్యాటర్లకు ఈ సిరీస్ సవాల్ గా మారింది.

IND vs SL

మరోవైపు బౌలింగ్‌లో బుమ్రా లేకపోవడం ఇబ్బందే. దీంతో వార్మప్ మ్యాచ్‌లో ప్రసిధ్ కృష్ణ, సిరాజ్ , గుర్నూర్ బ్రార్, అకీబ్ నబీ ఎలా రాణిస్తారనేది చూడాలి. అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్, జడేజాలతో పాటు మానవ్ సుతార్ , సరాంశ్ జైన్ కీలకం కాబోతున్నారు.

ఇదిలా ఉంటే వార్మప్ మ్యాచ్‌లో లంక ఎలెవన్‌కు సోనల్ దినూష సారథిగా వ్యవహరించనున్నాడు. టెస్ట్ సిరీస్‌లో అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొంతమంది యువ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. పేసర్లు లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, ఆఫ్ స్పిన్నర్ రమేశ్ మెండిస్‌పై అంచనాలున్నాయి. ఇండియా ఎ-తో మ్యాచ్ లో 10 వికెట్లతో అదరగొట్టిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలుమ్ సుదీర కూడా ఎంపికయ్యారు. వీరి స్పిన్ బౌలింగ్‌ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది చూడాలి.

Megastar Chiranjeevi : ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. మెగాస్టార్ టీమ్ రియాక్షన్

Exit mobile version