IND vs ZIM : టీ20 సిరీస్ క్లీన్ స్వీప్..చివరి మ్యాచ్‌లోనూ జింబాబ్వే చిత్తు

IND vs ZIM : వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

IND vs ZIM

జింబాబ్వే టూర్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లోనూ ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించింది. వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు బౌలింగ్‌లో పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో వరుసగా రెండు వైట్ వాష్ పరాభవాల తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ విజయాన్ని అందుకున్నాడు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచినా వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. గత మ్యాచ్ లో 20 పరుగులకే పరిమితమైన వైభవ్ ఈ సారి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తనదైన శైలిలో భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి..31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. ఇషాన్‌తో కలిసి రెండో వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇషాన్ కిషన్ (29) ఔటైన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి హాఫ్ సెంచరీ పార్టనర్ షిప్ సాధించాడు. సెంచరీ దిశగా సాగిన వైభవ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81 పరుగులకు దగ్గర ఔటయ్యాడు. తర్వాత శ్రేయాస్ అయ్యర్ 27, రింకూ సింగ్ 25, తిలక్ వర్మ 11 పరుగులు చేశారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో జింబాబ్వే ఆరంభం నుంచే తడబడింది. తొలి బంతికే మయాంక్ యాదవ్ ఓపెనర్ బెన్నెట్‌ను ఔట్ చేశాడు. తర్వాత ఆతిథ్య జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. సికందర్ రజా డకౌటయ్యాడు. ఇక్కడ నుంచి జింబాబ్వే కోలుకోలేకపోయింది.

IND vs ZIM

ర్యాన్ బర్ల్ హాఫ్ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. మిగిలిన బ్యాటర్లలో కురాన్ 20, మియర్స్ 19, మెదెవెరె 28, మరుమని 1, బ్రాడ్ ఎవాన్స్ 14 పరుగులకే ఔటయ్యారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో 157 పరుగులే చేయగలిగింది. బర్ల్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత బౌలర్లలో మయాంక్ యాదవ్ 3 , యశ్ ఠాకూర్ 2 వికెట్లు తీసారు.మూడు మ్యాచ్ లలో 151 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

Siddaramaiah : ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను..సిద్ధరామయ్య ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?

Exit mobile version