India
ముల్లాన్ పూర్‌లో భారత(India) స్పిన్నర్లు తిప్పేసారు. తొలుత బ్యాటింగ్ లో అదరగొట్టి భారీస్కోరు చేసిన టీమిండియా(India) తర్వాత బౌలింగ్ లోనూ చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో మానవ్ సుతార్, రెండో ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తిప్పేయడంతో ఆఫ్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ మూడు రోజుల్లోనే మ్యాచ్ ను ముగించేసింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ పెద్దగా పోటీనివ్వలేకపోయింది. 5 వికెట్లకు 113 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆఫ్ఘనిస్థాన్ టీమ్ కాసేపటికే ఆలౌటైంది. రెహమత్ షా (60) ఒక్కడే హాఫ్ సెంచరీతో పోరాడడంతో స్కోర్ కనీసం 150 దాటగలిగింది.
మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులకే ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్ కు భారత్ తమ ప్రణాళికకు తగ్గట్టే ఫాలో ఆన్ ఇచ్చింది. భారత బౌలర్లలో అరంగేట్రపు బౌలర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో ఆఫ్ఘన్ పతనాన్ని శాసించాడు. అతనితో పాటు ప్రసిద్ కృష్ణ మూడు వికెట్లతో సత్తా చాటాడు. వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ దక్కింది. భారత్‌కు 412 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
ఫాలో ఆన్ లో పడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆఫ్ఘనిస్థాన్ లంచ్ బ్రేక్ వరకూ వికెట్ కోల్పోకుండా బాగానే ఆడింది. అయితే లంచ్ తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగిపోయారు. వాషింగ్టన్ సుందర్ , కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో ఆఫ్ఘాన్ బ్యాటర్లను తిప్పేసారు. ఫలితంగా 42 పరుగుల దగ్గర మొదలైన వికెట్ల పతనం 112 పరుగులకే ముగిసిపోయింది.
గాయంతో షరాఫుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాకపోవడంతో 9 వికెట్లకే ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్ కు తెరపడింది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఆఫ్ఘనిస్థాన్ 14 పరుగుల వ్యవధిలోనే చివరి 6 వికెట్లు కోల్పోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది.
దీని ద్వారా టెస్ట్ క్రికెట్ లో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్ లో గిల్, రాహుల్ సెంచరీలతో చెలరేగగా భారత్ 564/8 రన్స్ కు డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ 4 , కుల్దీప్ యాదవ్ 3 , సుతార్ 1, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. మ్యాచ్ లో మొత్తం 7 వికెట్లు పడగొట్టడంతో పాటు బ్యాట్ తో 28 పరుగులు చేసిన మానవ్ సుతార్ అరంగేట్రంలోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
