LSG vs RR : లక్నోకు చావో రేవో..రాజస్థాన్ తో కీలక పోరు

LSG vs RR : ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది

LSG vs RR

ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న లక్నో సూపర్ జెయింట్స్ డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. తమ హోంగ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్(LSG vs RR) తో తలపడబోతోంది. ప్లే ఆఫ్ రేసులో మరింత వెనుకబడకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి జరిగే ప్రతీ మ్యాచ్ ఆ జట్టుకు కీలకమే. ప్రస్తుతం లక్నో 6 మ్యాచ్ లకు రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.

సన్ రైజర్స్, కోల్ కతా జట్లపై గెలిచిన తర్వాత లక్నో వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. బ్యాటింగ్ లో అంచనాలు పెట్టుకున్న ఏ ఒక్కరూ రాణించడం లేదు. పంత్ తో పాటు నికోలస్ పూరన్ పేలవ ఫామ్ తో నిరాశపరుస్తున్నారు. కెప్టెన్ గానూ పంత్ ఆకట్టుకోలేకపోతున్నాడు.

బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు కూడా లక్నో పేలవ ప్రదర్శనకు కారణంగా చెబుతున్నారు. ఆయుశ్ బదోనీ, ముకేశ్ చౌదరీ అంచనాలు అందుకోలేకపోతున్నారు. మిఛెల్ మార్ష్ , మార్కరమ్ కూడా భారీ ఇన్నింగ్స్ లే బాకీ ఉన్నారు. గత మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ వైఫల్యమే లక్నో ఓటములకు కారణమైంది.

అటు బౌలింగ్ లో మహ్మద్ షమీ పర్వాలేదనిపిస్తున్నా మిగిలిన బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. బౌలర్లు కూడా పూర్తిస్థాయిలో గాడిన పడితే తప్ప లక్నో గెలుపు బాట పట్టే అవకాశం లేదు.

మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా వరుసగా రెండు ఓటములతో డీలా పడింది. ఆరంభంలో అదరగొట్టిన రాజస్థాన్ గత రెండు మ్యాచ్ లలో సన్ రైజర్స్ , కోల్ కతా జట్ల చేతిలో పరాజయం పాలైంది. ఆ జట్టు బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ మెరుపు ఆరంభాలనిస్తున్నా తర్వాతి బ్యాటర్లు దానిని కొనసాగించలేకపోతున్నారు.

LSG vs RR

ఫలితంగా అనుకున్నదానికంటే తక్కువ స్కోర్లకే పరిమితమై మూల్యం చెల్లించుకుంటోంది. మిడిలార్డర్ బ్యాటర్లు కూడా ఫామ్ లోకి వస్తే రాజస్థాన్ కు తిరుగుండదు. బౌలింగ్ లో మాత్రం రాజస్థాన్ ఫామ్ లో ఉంది. ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ రాణిస్తున్నారు. అటు స్పిన్నర్ రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ కూడా తమ మ్యాజిక్ చూపిస్తున్నారు.

ఫామ్ లో లేని లక్నో బ్యాటర్లపై ఆధిపత్యం చెలయించేందుకు వీరికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు ఆరు సార్లు తలపడగా రాజస్థాన్(LSG vs RR) నాలుగింట గెలిచింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న లక్నో పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. పైగా బౌండరీలు పెద్దవిగా ఉండడంతో 140-160 మధ్య స్కోర్లు నమోదవుతున్నాయి.

Trump : యుద్ధానికి సిద్ధంగా ఉండండి..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్

Exit mobile version