Lucknow Super Giants
ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) కథ ముగిసింది. సీజన్ లో ఎనిమిదో ఓటమితో ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెడుగుడు ఆడడంతో చెపాక్ లో చిత్తుగా ఓడిపోయింది. భారీస్కోరు చేసినా, లక్నో బౌలర్లు చేతులెత్తేయడంతో చెన్నై భారీ లక్ష్యాన్ని ఊదేసింది. ఉర్విల్ పటేల్ విధ్వంసం హై లైట్ గా నిలిచింది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఆర్సీబీని ఓడించిన జోష్ తో ఉన్న లక్నో ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు మిఛెల్ మార్ష్ , జోష్ ఇంగ్లీస్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 5.1 ఓవర్లలోనే 77 పరుగులు జోడించారు. మార్ష్ (10) ఔటైనా ఇంగ్లీస్ విధ్వంసం సృష్టించాడు.
భారీ షాట్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సీఎస్కే బౌలర్లు ఎంత ప్రయత్నించినా అతన్ని ఔట్ చేయలేకపోయారు. 33 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 రన్స్ చేసి వెనుదిరిగాడు. అతని మొత్తం స్కోరులో 76 పరుగులు బౌండరీల ద్వాారానే వచ్చాయి. అయితే నికోలస్ పూరన్ (1), రిషబ్ పంత్ (15) మరోసారి నిరాశపరిచారు.
మార్కరమ్ కూడా త్వరగానే ఔటవడంతో లక్నో కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఈ దశలో షాబాజ్ అహ్మద్ ఆదుకున్నాడు. కేవలం 25 బంతుల్లోనే 43 (3 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. అతనితో పాటు హిమ్మత్ సింగ్ కూడా మెరుపులు మెరిపించడంతో లక్నో 20 ఓవర్లలో 8 వికెట్లకు 203 రన్స్ చేసింది. చెన్నై బౌలర్లలో ఓవర్టన్ 3 వికెట్లు తీశాడు.
ఛేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ తొలి వికెట్ కు 45 పరుగులు జోడించారు. సంజూ 14 బంతుల్లో 28 రన్స్ కు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ రెచ్చిపోయాడు. లక్నో బౌలర్లను ఉతికారేశాడు. భారీ సిక్సర్లతో చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తద్వారా 2023లో జైస్వాల్ ఫాస్టెస్ట్ రికార్డును సమం చేశాడు. కెఎల్ రాహుల్, కమిన్స్, షెఫర్డ్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించారు. ఉర్విల్ పటేల్, రుతురాజ్ రెండో వికెట్ కు 34 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఉర్విల్ 23 బంతుల్లో 65 (2 ఫోర్లు, 8 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. తర్వాత లక్నో(Lucknow Super Giants) బౌలర్లు పుంజుకోవడంతో చెన్నై వికెట్లు కోల్పోయింది. దీంతో చివరి 3 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సి ఉండగా… ప్రశాంత్ వీర్, శివమ్ దూబే చెన్నై విజయాన్ని పూర్తి చేశారు. ఈ సీజన్ లో చెన్నైకి ఇది ఆరో విజయం.
