PBKS
ఏకపక్షంగా సాగుతున్న ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు కాస్త ఊపు వచ్చింది. పంజాబ్ , గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చివరి వరకూ రసవత్తరంగా సాగింది. భారీస్కోరు చేస్తుందనుకున్న గుజరాత్ 162 పరుగులకే పరిమితమైతే…టాపార్డర్ మెరుపు బ్యాటింగ్ తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ను పంజాబ్(PBKS) సంక్లిష్టంగా మార్చుకుంది.
అయితే కూపర్ కన్నోలీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మ్యాచ్ గెలిచింది. కూపర్ నిలబడకుంటే మాత్రం పంజాబ్ కు ఈ మ్యాచ్ లో ఓటమే ఎదురయ్యేది.
గుజరాత్ టైటాన్స్ కు ఓ మాదిరి ఆరంభం లభించింది. కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్ తొలి వికెట్ కు 37 పరుగులు జోడించారు. సాయి సుదర్శన్ (13) ఔటైన తర్వాత శుభమన్ గిల్, బట్లర్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో గుజరాత్ 9.3 ఓవర్లకు 83 పరుగులు చేసింది. గిల్, బట్లర్ జోరు చూసిన తర్వాత 200 ప్లస్ స్కోరు చేయడం ఖాయంగా కనిపించింది. 27 బంతుల్లో 6 ఫోర్లతో 39 పరుగులు చేసిన గిల్ చాహల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ వేగంగా పరుగులు చేసే క్రమంలో 36 రన్స్ పార్టనర్ షిప్ నెలకొల్పారు.
ఫిలిప్స్ 17 బంతుల్లో 25 (1 ఫోర్, 1 సిక్సర్) పరుగులకు ఔటవగా.. కాసేపటికే బట్లర్ (38) కూడా వెనుదిరిగడంతో గుజరాత్ జోరుకు బ్రేక్ పడింది. ఫిలిప్స్ ను విజయకుమార్ వైశాఖ్ ఔట్ చేయగా.. బట్లర్ ను చాహల్ పెవిలియన్ కు పంపాడు. ఇక్కడ నుంచి గుజరాత్ పరుగుల వేటలో వెనుకబడిపోయింది.
అంచనాలు పెట్టుకున్న షారూఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, తెవాటియా ఆకట్టుకోలేకపోయారు. ముఖ్యంగా విజయకుమార్ వైశాఖ్ చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ ను కట్టడి చేశాడు. వైశాఖ్ తన 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
తద్వారా అత్యుత్తమ గణాంకాలతో పంజాబ్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. అలాగే యజ్వేంద్ర చాహల్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.
తర్వాత ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ప్రియాన్ష్ ఆర్య(7) నిరాశపరిచినా కూపర్ కన్నోలీ, ప్రభ్ సిమ్రన్ సింగ్ మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 76 పరుగులు జోడించారు. ఫలితంగా పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలో 55 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు.
తర్వాత శ్రేయాస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడే క్రమంలో 18 రన్స్ కు ఔటవడంతో పంజాబ్ 3 వికెట్లు చేజార్చుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూపర్ కన్నోలీ దూకుడుగా ఆడుతూ రన్ రేట్ తగ్గకుండా చూశాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన గుజరాత్ పేసర్ ప్రసిద్ధ కృష్ణ మ్యాచ్ ను మలుపు తిప్పే ప్రయత్నం చేశాడు.
వరుసగా శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, స్టోయినిస్ లను ఔట్ చేశాడు. అయితే మరో ఎండ్ లో కూపర్ మాత్రం భారీ షాట్లతో అలరించాడు. చివర్లో బార్ట్ లెట్ సిక్సర్ బాదడంతో పంజాబ్ కింగ్స్ ఊపిరి పీల్చుకుంది. పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కూపర్ కన్నోలీ 72 (44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు తీయగా.. మిగిలిన బౌలర్లు అంతగా ఆకట్టుకోలేకపోయారు.
Indian Railways : మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్నారా ?…ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే
