RR vs DC
ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారిన వేళ పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్లు పైన ఉన్న టీమ్స్ కు వరుసగా షాకులిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ కు ఢిల్లీ(RR vs DC) చెక్ పెట్టింది. ఐదు వికెట్ల తేడాతో గెలిచి వారి అవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మ్యాచ్ కీలకం కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.
ఓపెనర్ జైస్వాల్ త్వరగానే ఔటైనా, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ మాత్రం చెలరేగిపోయాడు. భారీ షాట్లతో రెచ్చిపోయాడు. జురెల్ తో కలిసి కేవలం 34 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వైభవ్ 21 బంతుల్లోనే 46 (5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. వైభవ్ వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు.
ఈ సీజన్ లో పెద్దగా ఆడని పరాగ్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. కేవలం 23 బంతుల్లోనే 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. జురెల్ , పరాగ్ మూడో వికెట్ కు 72 పరుగులు జోడించారు. 14 ఓవర్లకు రాజస్థాన్ స్కోరు 160/3..దీంతో ఖచ్చితంగా 230 ప్లస్ స్కోరు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఢిల్లీ పేసర్ మిఛెల్ స్టార్క్ మ్యాచ్ ను మలుపు తిప్పాడు.
తన తొలి రెండు ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 28 పరుగులు సమర్పించుకున్న మిచెల్ స్టార్క్ .. తన మూడో ఓవర్‌లో అదరగొట్టాడు. ఒకే ఓవర్‌లో రియాన్ పరాగ్, డోనోవాన్ ఫెర్రీరా, రవి సింగ్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు స్కోరు చేసింది. అంటే తన చివరి 6 ఓవర్లలో ఆ జట్టు.. కేవలం 33 పరుగులు మాత్రమే స్కోరు చేసింది. దీంతో అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4, లుంగీ ఎంగిడి 2, మాధవ్ తివారీ 2 వికెట్లు పడగొట్టారు.
ఛేజింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రెచ్చిపోయింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించారు. వీరిద్దరి జోరుతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లను ఆటాడుకున్న పోరెల్ , రాహుల్ తొలి వికెట్ కు 61 బంతుల్లోనే 105 పరుగులు జోడించారు. అభిషేక్ పోరెల్ 31 బంతుల్లో 51 ( 7 ఫోర్లు, 1 సిక్సర్ ), కెఎల్ రాహుల్ 42 బంతుల్లో 56 పరుగులు చేయగా..అక్షర్ పటేల్ ధాటిగా ఆడాడు.
స్టబ్స్ (4) , మిల్లర్ (9) నిరాశపరిచినా అశుతోష్ శర్మ చివర్లో మెరుపులు మెరిపించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లు సాధించగా.. రాజస్థాన్ కూడా 12 పాయింట్లతోనే నిలిచింది. ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్ లలో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.
