Team India
టీమిండియా జింబాబ్వే టూర్ ముగిసింది. టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టుకు ఇప్పుడు 20 రోజుల రెస్ట్ దొరికింది. భారత క్రికెట్ జట్టు తర్వాత శ్రీలంక టూర్‌కు వెళ్లబోతోంది. వచ్చే నెల 15 నుంచి శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును మంగళవారం ఎంపిక చేయనున్నారు.
ఈసారి జట్టు ఎంపిక సెలక్షన్ కమిటీకి తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు. డబ్ల్యూటీసీ 2026-27లో టీమిండియాకు కీలకంగా మారిన లంకతో టెస్ట్ సిరీస్‌కు కొంతమంది కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదు. స్టార్ పేసర్ బుమ్రా గాయంతో బాధపడుతుండగా, వాషింగ్టన్ సుందర్ ఇప్పటికే దూరమయ్యాడు.
ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ మధ్యలోనే బుమ్రా గాయపడ్డాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్నా, ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో అతన్ని ఎంపిక చేస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ లంకతో టెస్టు సిరీస్‌కు బుమ్రా దూరమైతే అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనేది సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. లంక-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో 10 వికెట్లు పడగొట్టిన గుర్నూర్ బ్రార్‌ను తీసుకునే అవకాశముంది.
ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ద్వారా గుర్నూర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. టెస్టు క్రికెట్‌లో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వని గుర్నూర్, లంకతో సిరీస్‌లో ఆడే అవకాశాలున్నాయి. మరోవైపు బుమ్రా దూరమైతే మాత్రం సిరాజ్, ప్రసిధ్ కృష్ణలపైనే పేస్ భారం పడనుంది. కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ పైనా అనుమానాలున్నాయి.
హర్షిత్ రాణా కూడా గాయాలతో బాధపడుతున్నాడు. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో సెలక్టర్ల ముందు యువ ఆటగాళ్లే ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నారు. కానీ శ్రీలంకను వారి సొంతగడ్డపై ఓడించడానికి పూర్తి యువ ఆటగాళ్లే సరిపోరు. సీనియర్లు సైతం భాగం కావాల్సిందే.
టీమిండియా(Team India) 2017లో చివరిసారి లంకలో టెస్టు సిరీస్ ఆడింది. అప్పటి సిరీస్‌లో కోహ్లి, అశ్విన్‌తో పాటు పుజారా ఆడారు. అప్పుడు ఆతిథ్య లంక జట్టును వైట్‌వాష్ చేసింది. తాజాగా శుభమన్ గిల్ సారథ్యంలోని భారత్ శ్రీలంకపై ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి కొలంబోలో రెండో టెస్టు జరగనున్నాయి.
Tatkal Tickets : ఆగస్టు 1 నుంచి తత్కాల్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..ఇక గంటల తరబడి నిలబడాల్సిన పనిలేదు
