Vaibhav
భారత క్రికెట్ లో టీ20 ఫార్మాట్ కు సంబంధించి కొత్త శకం ఆరంభమవుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రయాణం మొదలుకానుండగా, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ కెరీర్ కు తెరలేవబోతోంది. ఐర్లాండ్ తో సిరీస్ ద్వారా భారత యువ జట్టు సరికొత్తగా బరిలోకి దిగుతుండగా అందరి కళ్లు వైభవ్(Vaibhav) పైనే ఉన్నాయి.
సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న శ్రేయాస్ తొలి సిరీస్ కు సన్నద్ధమయ్యాడు. ఐర్లాండ్ తో రెండు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బెల్ ఫాస్ట్ లో తొలి టీ20 జరగనుంది. భారత్ విజయంపై ఎటువంటి అనుమానం లేకున్నా యువ ఆటగాళ్లతో నిండిన యంగ్ ఇండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాదిగా అండర్ 19, ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన వైభవ్(Vaibhav) ఇటీవల శ్రీలంక వేదికగా ట్రై సిరీస్ లోనూ భారత్ ఏ జట్టు తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
దీంతో ఈ చిచ్చర పిడుగుపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఐర్లాండ్ పై వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలుండగా సంజూ , అభిషేక్ శర్మలలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి నెలకొంది. సంజూ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. అయితే అభిషేక్ మాత్రం ఓపెనర్ గానే ఆడతాడు. దీంతో తుది జట్టు కూర్పుపై గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ఇదిలా ఉంటే శ్రేయాస్ అయ్యర్ పూర్తిస్థాయి కెప్టెన్ గా తొలి సిరీస్ ఆడబోతున్నాడు. వచ్చే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు కూర్పును సన్నద్ధం చేసే పనిలో టీమ్ మేనేజ్ మెంట్ ఉంది. దీంతో వచ్చిన అవకాశాన్ని ప్రతీ యువ ఆటగాడు సద్వినియోగం చేసుకుంటేనే జట్టులో చోటు ఉంటుంది. లేకుంటే ప్లేస్ గల్లంతవడం ఖాయం.
ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే లాంటి టీ ట్వంటీ స్పెషలిస్టులతో భారత బ్యాటింగ్ లైనప్ అత్యంత బలంగా ఉంది. అటు బౌలింగ్ లో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ కీలకం కానున్నారు.
ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లైనప్ కు అడ్డుకట్ట వేయడం ఐర్లాండ్ కు తలకు మించిన భారమే. మరోవైపు తొలి టీ ట్వంటీలో భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్ కు ఐర్లాండ్ ను తేలిగ్గా తీసుకుంటే ఇబ్బందులు తప్పవని పలువురు సూచిస్తున్నారు.
Pune Murder Case : పూణే మర్డర్ కేసులో ఎవరిది తప్పు? ఆ ముగ్గురు తండ్రుల గుండెకోతకు కారణం ఏంటి?
