Sanju
భారత క్రికెట్ జట్టులో కొంతకాలంగా ప్రతీ ప్లేస్ కోసం కనీసం నలుగురైదుగురు పోటీ పడుతున్న సీన్ కనిపిస్తుంది. ఓపెనర్ నుంచి బౌలర్ వరకూ అన్నింటిలోనూ బాగానే పోటీ ఉంటుంది. అయితే అవకాశాలు దక్కించుకున్న ఆటగాళ్లు నిలకడగా రాణించకపోతే మాత్రం వేటు వేయడానికి సెలక్టర్లు ఏ మాత్రం ఆలోచించడం లేదు.
ఎందుకంటే చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తుండడమే దీనికి కారణం. అయితే హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత ఈ సంప్రదాయం మరింత పెరిగింది. సీనియర్ల నుంచి యువ ఆటగాళ్ల వరకూ ఎవరినైనా తప్పించడానికి గంభీర్ ఏమాత్రం వెనుకాడడం లేదు. ఇలా ఆలోచించే జింబాబ్వే టూర్‌కు సంజూ(Sanju) శాంసన్‌ను తప్పించినట్టు తెలుస్తోంది.
ఐర్లాండ్ సిరీస్‌లోనూ, ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో విఫలమవడంతో సంజూను తప్పించి చిచ్చర పిడుగు వైభవ్‌కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మూడో టీ20లోనూ సంజూను పక్కన పెట్టారు. అలాగే జింబాబ్వే టూర్‌కు సైతం ఎంపిక చేయలేదు. దీనిపై మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీసీఐ సెలక్టర్లు మాత్రం రెస్ట్ ఇచ్చామని చెబుతున్నా.. వైభవ్ సూర్యవంశీ క్లిక్ అయితే మాత్రం సంజూ శాంసన్ కెరీర్ ముగిసినట్టేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే మరికొందరు మాత్రం ఈ అభిప్రాయం సరి కాదంటున్నారు. 2026 టీ20 ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన సంజూను రెండు, మూడు వైఫల్యాలకే పక్కన పెట్టడం తప్పిదమే అవుతుందన్నది కొందరు మాజీల వాదన. పైగా సెలక్టర్లు సంజూను 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
జింబాబ్వే టూర్ కోసం ఎంపిక చేసిన జట్టుకు సంబంధించి విమర్శలకు బీసీసీఐ కూడా స్పందించింది. జింబాబ్వే పర్యటనకు సంజూను తొలగించలేదని, యువ వికెట్ కీపర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను పరీక్షించడానికే అతనికి విశ్రాంతినిచ్చామని బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి. చిన్న సిరీస్‌కు ఇద్దరు సీనియర్ వికెట్ కీపర్లు అనవసరమని భావించే సంజూకు రెస్ట్ ఇచ్చినట్టు తెలిపాయి.
2027 వన్డే ప్రపంచకప్‌ను లక్ష్యంగా చేసుకుని, రాబోయే వన్డే సిరీస్‌లలో సంజూకు రెగ్యులర్ అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. కేవలం టీ20లకే కాకుండా, వన్డే ఫార్మాట్‌లోనూ సంజూ శాంసన్ ఆటతీరుపై గంభీర్ నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సంజూను ప్రపంచకప్ ప్రణాళికలకు అనుగుణంగానే కొన్ని సిరీస్‌లకు విశ్రాంతి కల్పిస్తున్నట్టు బోర్డు వర్గాలు చెప్పినట్లు తెలుస్తోంది.
Shiva temples : రావణుడు కట్టించిన శివయ్య ఆలయాల గురించి విన్నారా?
