Digital Waste
సాధారణంగా మనమంతా ఇంటిని , గదులను శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడతాం. కానీ మన చేతిలో ఉండే మొబైల్ విషయంలో మాత్రం ఆ జాగ్రత్త అస్సలు ఉండదు. వందలు, వేల కొద్దీ అనవసరమైన స్క్రీన్ షాట్లు, ఎప్పుడో పంపిన గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు, పనికిరాని వీడియోలు, బ్లర్ అయిన ఫోటోలతో ఫోన్ మెమరీ నిండిపోయేలా దాచుకుంటూనే ఉంటాం.
ఏదో ఒక రోజు అవసరమవుతుందనే భ్రమతో ఈ డిజిటల్ చెత్త(Digital Waste)ను ప్రోగు చేయడాన్ని సైకాలజీలో డిజిటల్ హోర్డింగ్ (Digital Hoarding) అని పిలుస్తారు. ఇది కేవలం ఫోన్ మెమరీ ప్రాబ్లెమ్ మాత్రమే కాదు. మన మెదడుపై తీవ్రమైన ఒత్తిడిని కలిగించే ఒక మానసిక రుగ్మత అని సైకాలజిస్టులు చెబుతున్నారు.
ఈ డిజిటల్ హోర్డింగ్‌కు మెయిన్ రీజన్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO) అని మానసిక నిపుణులు అంటున్నారు. అంటే, ఒకవేళ ఈ ఫోటోనో , సమాచారాన్నో కనుక డిలీట్ చేస్తే, భవిష్యత్తులో అది దొరకదేమోనన్న అనవసరమైన టెన్షన్ మనల్ని ఏదీ వదులుకోనివ్వదు. ఒకప్పుడు ఫోటోలు దిగాలంటే ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు డిజిటల్ కెమెరాల వల్ల అపరిమితంగా ఫోటోలు తీసుకునే వీలుండటం వల్ల, ఏది ముఖ్యమో ఏది కాదో తేల్చుకోలేని మీమాంశ (Decision Fatigue)లో పడిపోతాం. దీంతో ఏదీ డిలీట్ చేయకుండా ఫోన్‌ను ఒక డిజిటల్ చెత్తకుండీ (Digital Waste)లా మార్చేస్తాం.
ఈ డిజిటల్ హోర్డింగ్ మనిషి మెదడులో తెలియని మెంటల్ టెన్షన్ (Mental Clutter)ను పెంచుతుంది. ఫోన్ గ్యాలరీని ఓపెన్ చేసినప్పుడు వేల సంఖ్యలో ఫోటోలు కనిపిస్తే, మన ఉపచేతన మనస్సు అంటే సబ్‌కాన్షియస్ మైండ్ ఆ అస్తవ్యస్తతను చూసి గందరగోళానికి గురవుతుంది.
ఇది ఏకాగ్రత తగ్గడానికి, చిరాకు పెరగడానికి దారి తీస్తుంది. మనం ఉండే గది ఎంత చిందరవందరగా ఉంటే మనకు అసౌకర్యంగా ఉంటుందో, డిజిటల్ గ్యాలరీ కూడా అంతే నెగిటివ్ ఎఫెక్ట్‌ను చూపిస్తుంది. ముఖ్యమైన విషయాన్ని, లేదా ఫోటోను వెతకాల్సి వచ్చినప్పుడు ఈ డిజిటల్ చెత్త’ అంతా అడ్డుపడి మనల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. దీనివల్ల మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది.
దీని నుంచి బయటపడాలంటే డిజిటల్ డీటాక్స్ చాలా అవసరం అని మానసిక నిపుణులు అంటున్నారు. వారానికోసారి లేదా నెలకు ఒకసారైనా ఫోన్ గ్యాలరీని శుభ్రం చేసుకోవాలట. అనవసరమైన యాప్స్, స్క్రీన్ షాట్స్, వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజెస్ వెంట వెంటనే డిలీట్ చేయడం అలవాటు చేసుకోవాలి.
మన ఫోన్ ఎంత ఖాళీగా, క్రమబద్ధంగా ఉంటే మన మెదడు కూడా అంత ప్రశాంతంగా, చురుగ్గా పని చేస్తుంది. డిజిటల్ ప్రపంచంలో తక్కువ ఉండటమే ఎక్కువ ఆనందం (Less is More) అన్న సూత్రాన్ని పాటిస్తే ఈ మానసిక ఒత్తిడి నుంచి సులభంగా బయటపడొచ్చు.
Kohli : హోల్డర్ వివాదాస్పద క్యాచ్..అంపైర్ పై కోహ్లీ తీవ్ర ఆగ్రహం
