Ghost Jobs: నిరుద్యోగులతో కార్పొరేట్ కంపెనీల వింత ఆట.. ఏంటీ ఘోస్ట్ జాబ్స్ ?

Ghost Jobs::జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేయగానే వందల సంఖ్యలో అట్రాక్ట్ అయ్యే ప్యాకేజీలతో ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తాయి.

Ghost Jobs

కొన్నాళ్లుగా జాబ్ మార్కెట్‌లో ఘోస్ట్ జాబ్స్(Ghost Jobs) అనే ఒక వింతైన, భయంకరమైన ట్రెండ్ నడుస్తోంది. వినడానికి ఇదేదో దెయ్యాల సినిమా పేరులా ఉన్నా, ఇది దాని కంటే భయంకరమైన నిజం అనే చెప్పాలేమో. లింక్డిన్ , నౌకరీ డాట్ కామ్ వంటి జాబ్ పోర్టల్స్ ఓపెన్ చేయగానే వందల సంఖ్యలో అట్రాక్ట్ అయ్యే ప్యాకేజీలతో ఉద్యోగ ప్రకటనలు కనిపిస్తాయి.

వాటిని చూసి ఉత్సాహంగా అప్లై చేస్తే మాత్రం అటు నుంచి ఉలుకూ ఉండదు..పలుకూ ఉండదు. నెలలు గడిచిపోతున్నా కనీసం రిజెక్షన్ మెయిల్ కూడా రాదు. ఇలాంటివి ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయాయి. ఈ అడ్వర్టైజ్‌మెంట్లన్నీ కేవలం షో కోసమే తప్ప, నిజంగా ఎవరినీ రిక్రూట్ చేసుకోవడానికి కాదన్న విషయం ఆ కంపెనీలకు మాత్రమే తెలుసు. ఐటీ ఇండస్ట్రీలో జరుగుతున్న ఈ ఘోస్ట్ మాయాజాలం మీద కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది.

కంపెనీలు ఎందుకు ఇంత పచ్చిగా నిరుద్యోగుల ఆశలతో ఆడుకుంటున్నాయనేదే అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే దీని వెనుక ముఖ్యంగా మూడు పెద్ద స్కెచ్‌లు ఉన్నాయంటున్నారు ఐటీ నిపుణులు. మొదటిది.. వారి కంపెనీ పరువు కాపాడుకోవడం. అంటే మార్కెట్‌లో వారి కంపెనీ సూపర్ వృద్ధిలో ఉందని.. రోజుకు వందల మందిని తీసుకుంటున్నామని ఇన్వెస్టర్లకు కలరింగ్ ఇవ్వడానికి ఈ నకిలీ నోటిఫికేషన్లనే ఒక ఆయుధంగా వాడుతున్నారు.

రెండోది.. ఇన్-హౌస్ పాలిటిక్స్ కూడా ఇంపార్టెంటే. కంపెనీలో ఉన్న పాత ఉద్యోగులు ఎప్పుడైనా పని ఒత్తిడి భరించలేక క్వశ్చన్ చేసినప్పుడు, మీరూ చూడండి.. మీ కోసమే కొత్తవాళ్లను వెతుకుతున్నాం, కానీ ఇంకా కరెక్ట్ కాండిడేట్స్ దొరకడం లేదని సర్దిచెప్పడానికి ఈ ఘోస్ట్ యాడ్స్ వాడతారు. అంటే, పని చేసేవాడిని నమ్మిస్తూ వారితోనే గొడ్డు చాకిరీ చేయించడానికి ఇదొక టెక్నిక్ అన్నమాట.

ఇక మూడో కారణమయితే మరీ షాకింగ్‌గా ఉంటుంది. డేటా మైనింగ్ అనే స్కెచ్‌లో కంపెనీలకు మనుషుల కంటే వాళ్ల డేటా ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తాయి. అంటే ప్రస్తుతం రిక్రూట్మెంట్ అవసరం లేకపోయినా సరే, వేల మంది టాలెంటెడ్ కుర్రాళ్ల సీవీలు సేకరించి వాటిని ఒక లైబ్రరీలా దాచి పెట్టుకుంటాయి.

Ghost Jobs

భవిష్యత్తులో ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే, అప్పుడు ఈ డేటాబేస్ వాడుకుని తక్కువ రేటుకు దొరికే వారిని పట్టుకోవడానికి వాడుకుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీల మాయాజాలం తెలియక వేలాదిమంది యూత్ తమ విలువైన సమయాన్ని, ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నారు. గంటల తరబడి పోర్ట్ ఫోలియోలు రెడీ చేసుకుని, ఇంటర్వ్యూ కాల్ కోసం ఆశగా చూసేవారికి చివరికి మిగిలేది సున్నా మాత్రమే.

మరి ఈ దెయ్యం ఉద్యోగాల( Ghost Jobs)ను గుర్తించడం ఎలా అంటే.. ఒకే జాబ్ పోస్ట్.. నెలకు పైగా ఉన్నా,  రీ-పోస్ట్ అవుతున్నా సరే, లేకపోతే ఆ కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఆ ఖాళీలు కనిపించకపోయినా అవి ఘోస్ట్ జాబ్స్ అని అర్ధం చేసుకోవాలి.

అందుకే యూత్ ఇకపై కేవలం ఆన్‌లైన్ సైట్స్ మీద మాత్రమే ఆధారపడకుండా, డైరెక్ట్ నెట్‌వర్కింగ్ , రిఫరల్స్ మీద దృష్టి పెట్టాలి. కార్పొరేట్ కంపెనీలు వేసే ఈ మాయా వలయంలో చిక్కుకోకుండా ఉండాలంటే అభ్యర్థులు కూడా అంతే స్మార్ట్‌గా ఆలోచించాలి. జాబ్ అంటే కేవలం జీతం మాత్రమే కాదు, అది ఒక మనిషి కల.. ఆ కలతో ఆడుకునే ఈ ఘోస్ట్ సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version