Konda Surekha
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొద్ది రోజులుగా ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీనంతగా రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అయితే అంతా అనుకున్నట్లుగానే.. నిన్నటివరకు కేబినెట్‌లో పవర్‌ఫుల్ పొజిషన్‌లో ఉన్న మంత్రి కొండా సురేఖకు..కొండా ఫ్యామిలీ ఏ మాత్రం ఊహించని రీతిలో కాంగ్రెస్ అధిష్ఠానం మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చింది.
గురువారం సాయంత్రంలోగా సురేఖ తన మంత్రి పదవికి స్వచ్ఛందంగా రిజైన్ చేయాల్సిందే అంటూ ఢిల్లీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చేశాయి. అంతేకాదు ఒకవేళ పార్టీ మాటను పక్కనబెట్టి సురేఖ వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తే మాత్రం.. పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు.
దీంతో ఇక ఏమాత్రం ఆలోచించకుండా కేబినెట్ నుంచి డైరెక్టుగా డిస్మిస్ చేస్తూ గవర్నర్‌కు లేఖ పంపడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి యంత్రాంగం పక్కా స్కెచ్‌తో సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హస్తిన స్థాయిలో జరిపిన చర్చలు ఫలించి..ఈ రాజకీయ సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది.
కాగా ఇటీవల పరకాల అసెంబ్లీ నియోజకవర్గం సీటు విషయంలో.. కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత..ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చేసిన ఘాటుగా కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలోనే కాదు తెలంగాణ రాజకీయాల్లోనూ పెద్ద దుమారాన్నే రేపాయి.
మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీలోని మెయిన్ లీడర్స్ , టీపీసీసీ అధినేత మహేశ్ గౌడ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులు కూడా సురేఖపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆమెను కేబినెట్ నుంచి తప్పించాల్సిందేనంటూ హైకమాండ్ ముందు గట్టిగా తేల్చి చెప్పారు.
దీనికి తోడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో హైకమాండ్‌తో సుదీర్ఘంగా భేటీ అయి తెలంగాణలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే..సురేఖ ఈరోజు సాయంత్రంలోగా రాజీనామా పత్రాన్ని పంపాలనిహెచ్చరిక జారీ చేసినట్లు తెలుస్తోంది.
హస్తిన నుంచి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకోనున్న సమయంలో, ఈ రిజైన్ వ్యవహారం
ఉత్కంఠను రేపుతోంది. ఒకవేళ ఖర్గే ఇచ్చిన గడువు లోగా ఆమె రాజీనామా లేఖ అందించకపోతే, కఠిన చర్యల దిశగా రేవంత్ సర్కార్ వేగంగా పావులు కదపనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పరిస్థితిని అర్థం చేసుకున్న కొండా సురేఖ కూడా రాజీనామాకే మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే మధ్యాహ్నం తర్వాత తన ఇంట్లో అత్యవసరంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఆమె కాంగ్రెస్‌తో తనకున్న బంధాన్ని శాశ్వతంగా తెంచుకునేలా మాట్లాడతారా లేదంటే సైలెంట్‌గా రాజీనామాను ప్రకటిస్తారా అనేది ఉత్కంఠను రేపుతోంది.
నిజానికి, భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడానికి కొండా సురేఖ మొదలుపెట్టిన ప్రెజర్ పాలిటిక్స్, చివరికి ఇప్పుడు ఆమె సొంత కేబినెట్ బెర్త్‌కే ఎసరు తెచ్చిపెట్టినట్లు అయింది. అలాగే కూతురు చేసిన కామెంట్లను సురేఖ ఖండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి రోజు సీఎం రేవంత్ రెడ్డికి సురేఖ రాఖీ కట్టడంతో ఇక రాజీ అయిపోయినట్లేనా అన్న టాక్ నడిచింది. కానీ, అలాంటి సెంటిమెంట్లన్నీ పక్కనబెట్టి తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అనే రీతిలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి.. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై ఒక సరికొత్త చర్చకు తెరతీసింది.
Trump Birthright Citizenship : బర్త్ రైట్ రూల్‌కు బ్రేక్.. ట్రంప్ ఆర్డర్స్‌పై యూఎస్ కోర్ట్ కౌంటర్
